![]() |
![]() |
.jpg)
నాగార్జున తాను నిర్మించే సినిమాలకు రిషూట్‌లు చేస్తారనే పేరుంది. ఒక్కోసారి అవి విమర్శలకు దారితీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. "నేను నిర్మించిన సినిమాకు రిషూట్ అనేది తప్పనిసరి." అని ఒక సందర్భంలో ఆయనే ప్రకటించేశారు. కల్యాణ్ కృష్ణను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ మూవీలో ఆయన తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ పోషించారు. ఆ సినిమాకి రిషూట్ చేయడం అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద టాకింగ్ పాయింట్ అయింది.
"రిషూట్‌కు నేను ఓ ఐదు రోజులు ప్రత్యేకంగా పెట్టుకుంటాను. నాకు మాత్రం ప్రతి సినిమాని చూసినప్పుడల్లా ఫలానా సీన్‌ను ఇంకా బాగా చేసుంటే, తీసుంటే బాగుండేదనిపిస్తుంది. అసలు ఈ సినిమాని ఎందుకు ఒప్పుకున్నాను, ఒప్పుకోవాల్సింది కాదే అని కూడా అనుకున్న సందర్భాలున్నాయి. అప్పుడే మనిషికి ఎదుగుదల. ఒక్కసారి సినిమా విడుదలయ్యిందంటే ఏమీ చెయ్యలేం. మన చేతుల్లో ఏమీ ఉండదు. నేను చేసేది తప్పో, ఒప్పో పర్‌ఫెక్టుగా చెయ్యాలనుకుంటాను. మొదట నాకు, నా వాళ్లందరికీ తృప్తిగా ఉండాలి. ఈ సినిమాని రిషూట్ చేశారనే విషయాన్ని నెగటివ్ కోణంలో ప్రచారం చేశారు. అందుకే ఈ వివరణ. మనం, మన్మథుడు, మాస్, సూపర్ సినిమాలకు కూడా రిషూట్ చేశాం. ఆఖరుకు 'భాయ్' సినిమాకు కూడా చేశాం. కానీ ఆ సినిమా రిషూట్‌కు కూడా అతీతమైపోయింది. దానికి ఏం చేసినా ఎవరూ కాపాడలేరు. ఎందుకంటే స్క్రిప్టులోనే మిస్టేక్ ఉంది. బయటి బేనర్లు తీసిన సినిమాలకు కూడా వాళ్లు అడిగితే రిషూట్‌కు నేను రెడీగా ఉంటాను." అని నాగార్జున చెప్పుకొచ్చారు.
ఆయన ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. హిందీలో 'బ్రహ్మాస్త్ర' షూటింగ్‌ను పూర్తి చేశారు. కల్యాణ్ కృష్ణతో 'బంగార్రాజు' మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
![]() |
![]() |