![]() |
![]() |
ఒకప్పుడు మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన వీరప్పన్ గురించి మీడియా పుణ్యమా అని ఇప్పటి తరానికి కూడా బాగా తెలిసింది. అతని జీవిత చరిత్ర సినిమాల రూపంలో వస్తుండడంతో పూర్తి సమాచారం అందరికీ అందుతోంది. తాజాగా వీరప్పన్‌కి సంబంధించిన ఒరిజినల్ వీడియోను జీ 5 ఓటీటీలో విడుదల చేశారు. ఇందులో సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తావన తెచ్చాడు వీరప్పన్. డిసెంబర్ 12 రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. జీ5 మాత్రం ‘కూసే మునిసామి వీరప్పన్’ పేరుతో స్ట్రీమింగ్ చేయనున్న డాక్యుమెంటరీ నుంచి ఒక ఒరిజినల్ వీడియోను ఈ సందర్భంగా ప్రేక్షకులతో పంచుకుంది. ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 14న స్ట్రీమింగ్ కానుంది.
ఆ వీడియోలో వీరప్పన్ మాట్లాడుతూ ‘రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంజిఆర్‌గారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎంజీఆర్‌లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టడం సాధ్యమయ్యే పనికాదు. ఎంజీఆర్‌లాగే రజనీకాంత్ కూడా అవుతారని నాకు తెలుస్తోంది. ఆయన అందర్నీ గౌరవిస్తారు. దేవుడిని బాగా నమ్ముతారు. కానీ.. ఒక్క విషయం ఆయనకు చెప్పదలుచుకున్నాను. అయ్యా రజనీకాంత్... మీరు రాజకీయాల్లోకి రావొద్దు. ఎవరికీ మద్దతు తెలపొద్దు. నిన్ను మింగటానికి ఎన్నో మొసళ్లు వెయిట్ చేస్తున్నాయి. అవి ఒక్కసారిగా నీపై దాడి చేస్తాయి. దయచేసి అమాయకుడిలా బలి కావొద్దు’’ అంటూ వీరప్పన్ చెప్పిన మాటల ఒరిజినల్ వీడియోను విడుదల చేయటం ఆసక్తికరంగా మారింది. రజనీకాంత్ శ్రేయస్సును కోరి వీరప్పన్ ప్రేమగా హెచ్చరించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. రజనీకాంత్ ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ ఏ పార్టీకీ మద్దతు ఇవ్వలేదు కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లో రావాలని సిద్ధపడినప్పటికీ అనారోగ్యం వల్ల ఆ ప్రయత్నాని రజనీ విరమించుకున్నారు. కొన్ని సంవత్సరాలపాటు మూడు రాష్ట్రాల పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరిగిన వీరప్పన్ పట్టుకోవడం ఎవ్వరి వల్లా కాలేదు. చివరికి 2004లో పథకం ప్రకారం చేసిన ఓ ఎన్‌కౌంటర్‌లో వీరప్పన్ మరణించాడు. ఇప్పుడు ఆయన జీవిత చరిత్రను ఓ డాక్యుమెంటరీ రూపంలో జీ5 ప్రసారం చేయనుంది.
![]() |
![]() |