![]() |
![]() |
సినిమా రంగంలో వారసత్వం అనేది ఎప్పటి నుంచో ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడది చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఒకప్పుడు ఇది నామమాత్రంగా ఉండేది. కానీ, ఇప్పుడు అన్ని విషయాల్లోనూ మార్పులు జరుగుతున్నట్టే సినిమా వారసత్వంలోనూ జరుగుతున్నాయి. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్... ఇలా ఎవరి వారసులను వారు రంగంలోకి దింపేసి అదృష్టాన్ని పరీక్షించుకోమంటున్నారు. దీని వల్ల టాలెంట్ ఉన్న కొత్తవారికి అవకాశాలు రావడం లేదనే వాదన కూడా ఉంది. దాన్ని పక్కన పెడితే.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చినా వారిలో టాలెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు తప్ప బ్యాక్‌గ్రౌండ్ చూసి కాదని ఎంతో మంది హీరోలు, హీరోయిన్ల విషయంలో రుజువైంది.
ఇప్పుడలాంటి వారసత్వంతోనే ఒకప్పటి టాప్ హీరోయిన్ ఆమని మేనకోడలు హ్రితికా శ్రీనివాస్ ‘అల్లంత దూరాన’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తన రెండో సినిమాగా ‘సౌండ్ పార్టీ’ రిలీజ్‌కి సిద్ధమైంది. ఆల్రెడీ ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించి రెండో సినిమా పూర్తయి రిలీజ్‌కి రెడీ అయ్యే వరకు ఆమనితో తనకున్న బంధుత్వాన్ని గురించి హ్రితిక ఎక్కడా రివీల్ చెయ్యకపోవడం విశేషం.
తన వారసత్వం గురించి హ్రితిక మాట్లాడుతూ ‘మా అత్తయ్య ఆమని నటి కావడంతో చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో కూడా నటించాను. ‘అల్లంత దూరాన’ అనే సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో పరిచయమయ్యాను. ఇది తెలుగులో నాకు ఇది రెండో చిత్రం. ఇందులో నేను సిరి అనే పాత్రలో నటించాను. ‘సౌండ్ పార్టీ’ అనేది ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్. కామెడీయే కాదు, ఈ సినిమాలో మంచి కంటెంట్ కూడా ఉంది. తప్పకుండా ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది’ అని ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతోంది హ్రితిక.
ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘జంబలకిడి పంబ’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన ఆమని ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఒక దశలో ఫ్యామిలీ హీరోయిన్ అంటే ఆమని పేరే వినిపించేది. ఇప్పుడు ఆమని మేనకోడలు హ్రితిక హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. అత్త పోలికలు హ్రితికలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మరి టాలెంట్ విషయంలో అత్త పోలిక వచ్చిందో లేదో త్వరలోనే తెలుస్తుంది.
![]() |
![]() |