Home  »  News  »  టైగర్‌ నాగేశ్వరరావు మూవీ రివ్యూ

Updated : Oct 20, 2023

నటీనటులు : రవితేజ, నుపూర్‌ సనన్‌, రేణు దేశాయ్‌, అనుపమ్‌ ఖేర్‌, జిషు సేన్‌గుప్తా, మురళీశర్మ, నాజర్‌, గాయత్రీ భరద్వాజ్‌, అనుకృతి వాస్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్‌.మధి
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
మాటలు: శ్రీకాంత్‌ విస్సా
ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా
ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌
సహనిర్మాత: మయాంక్‌ సింఘానియా
నిర్మాత: అభిషేక్‌ అగర్వాల్‌
బ్యానర్‌: అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌
దర్శకత్వం: వంశీ
విడుదల తేదీ: 20.10.2023 

రాజా ది గ్రేట్‌ వంటి పెద్ద హిట్‌ తర్వాత రవితేజ కెరీర్‌లో వరసగా నాలుగు ఫ్లాపులు పడ్డాయి. ఆ తర్వాత క్రాక్‌తో మరోసారి హిట్‌ ట్రాక్‌లోకి వెళ్ళేందుకు సిద్ధ పడ్డ రవితేజకు మరో రెండు సినిమాలు బ్రేక్‌ వేశాయి. ఆ తర్వాత చేసిన ధమాకాతో మంచి హిట్‌ను అందుకున్నాడు.  రావణాసురతో మరోసారి ఫ్లాప్‌ చూశాడు. ఇలా రవితేజ కెరీర్‌ గ్రాఫ్‌ అప్‌ అండ్‌ డౌన్‌లో వెళ్తుండగా స్టూవర్ట్‌పురం నాగేశ్వరరావు అనే ఓ దొంగ బయోపిక్‌ చేసి మళ్ళీ ట్రాక్‌లోకి రావాలనుకున్నాడు. దీనికోసం డైరెక్టర్‌ వంశీ ఎంతో రీసెర్చ్‌ చేసి అతని జీవిత చరిత్రను సినిమాగా రూపొందించేందుకు రెడీ అయ్యాడు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగేశ్వరరావు జీవితంలో ఎన్నో చీకటి వెలుగులు ఉన్నాయి. వాటిని తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు వంశీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు? నాగేశ్వరరావు క్యారెక్టర్‌కి రవితేజ ఎంతవరకు న్యాయం చేశాడు? ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంది? హిట్‌, ఫ్లాపుల మధ్యలో తన కెరీర్‌ నెట్టుకొస్తున్న రవితేజకు ఈ సినిమా మరో హిట్‌ని అందించిందా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ :

స్టూవర్ట్‌పురం అంటేనే దొంగలు నివాసం ఉండే ఊరు అనే పేరు ఉంది. వ్యవసాయం చేద్దామనుకున్నా దానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో దొంగతనాలనే వృత్తిగా చేసుకున్నారు అక్కడి ప్రజలు. వారి బలహీనతను సొమ్ము చేసుకునేందుకు రాజకీయ నాయకులు, అధికారులు ప్రయత్నిస్తూ వారిని మరింత అణగదొక్కే ప్రయత్నం చేస్తుంటారు. ఆ ఊరిలో జరుగుతున్న ఘటనలను చూస్తూ పెరిగిన నాగేశ్వరరావు జీవిత కథ ఇది. అతని జీవితంలోని కొన్ని విశేషాలతో ఈ సినిమా రూపొందింది. నాగేశ్వరరావు దొంగతనాలు, దోపిడీలు చేయడం, ఎంతో మందిని చంపడం, ఆఖరికి కన్నతండ్రినే కడతేర్చడం వంటి సీన్స్‌తో ఫస్ట్‌హాఫ్‌ నడుస్తుంది. ఏ దొంగతనమైనా ముందు చెప్పి చెయ్యడం అతని అలవాటు. చివరికి ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫీస్‌లోనే దొంగతనం చేస్తానని ప్రకటిస్తాడు నాగేశ్వరరావు. ఎంతో సెక్యూరిటీ ఉన్నప్పటికీ తను చెప్పినట్టుగానే పి.ఎం. ఆఫీస్‌లో ప్రవేశించి అక్కడ ఓ లెటర్‌ పెట్టి, ఓ వస్తువుని దొంగిలించుకొని వెళ్తాడు. అలా ఎందుకు చేశాడు అనే విషయాన్ని తెలుసుకునేందుకు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌(అనుపమ్‌ ఖేర్‌) ఓ సాధారణ వ్యక్తిగా స్టూవర్ట్‌పురం వెళ్లి ఆ ఊరి వారితో కొన్నాళ్ళు కలిసి ఉంటాడు. నాగేశ్వరరావును అందరూ దొంగ అనే కోణంలోనే చూస్తున్నారని, అతనిలోని మరో కోణం మంచితనం అని ఆ ఊరి పెద్ద చెబుతాడు. ఫస్ట్‌హాఫ్‌ అంతా నాగేశ్వరరావు చేసిన దొంగతనాల గురించి చూపించి, సెకండాఫ్‌లో అసలు జరిగిన వాస్తవం ఏమిటి అనేది స్టూవర్ట్‌పురం ఊరి పెద్ద చేత చెప్పించారు. ఫస్ట్‌హాఫ్‌లో ఒక కరడుగట్టిన దొంగలా కనిపించే నాగేశ్వరరావు.. సెకండాఫ్‌లో పేదవారిని ఆదుకునే మనిషిగా, పిల్లలను చదివించి గొప్పవారిని చెయ్యాలనే ఆశయం కలిగిన వ్యక్తిగా, ఊరి కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని గొప్పవాడిగా కనిపిస్తాడు. ప్రపంచానికి దొంగగా పరిచయమైన నాగేశ్వరరావు ఊరికి మంచి చేయాలని ఎందుకు తపించాడు? ఈ క్రమంలో జీవితంలో అతనికి ఎదురైన సవాళ్ళు ఏమిటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : 

ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ఘటనలను తీసుకొని తెరకెక్కించడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని. దానికి ఎంతో పరిశీలన అవసరం. టైగర్‌ నాగేశ్వరరావు సినిమా విషయానికి వస్తే కొన్ని సన్నివేశాలను మినహాయిస్తే కల్పిత కథే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్‌ మొత్తం అతను చేసిన దొంగతనాలు, దోపిడీలు, హత్యలను జనరల్‌గా చూపించేశారు. సెకండాఫ్‌కి వచ్చేసరికి అతను చేసినవన్నీ ఏ ఉద్దేశంతో చేశారు. అతను చేసిన కొన్ని దొంగతనాలు, హత్యల వెనుక అసలు కారణం ఏమిటి అనేది సెకండాఫ్‌లో అతని పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో చూపించడంతో అతని జీవితం ఎన్ని మలుపులు తిరిగింది, ఊరి కోసం ఎన్ని మంచి పనులు చేసాడు అనేది స్పష్టమవుతుంది. సినిమా ఆసక్తికరంగానే మొదలైనప్పటికీ రాను రాను స్లో నేరేషన్‌ వల్ల కథపై ఆసక్తి సన్నగిల్లుతుంది. కొన్ని సన్నివేశాలు లెంగ్తీగా ఉండడం వల్ల మరింత బోర్‌ కొట్టిస్తుంది. అలాగే రవితేజను యంగ్‌ ఏజ్‌లో చూపించేందుకు చేసిన ప్రయత్నం చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. ఇక సెకండాఫ్‌ లెంగ్తీగా ఉండడం ఎక్కువగా సాగతీత ధోరణిలో వెళ్లడం వల్ల సినిమా ఎప్పుడు కంప్లీట్‌ అవుతుందా అనే ఫీలింగ్‌ ఆడియన్స్‌కి కలుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. హింస... దర్శకుడు విచక్షణ అనేది లేకుండా చాలా దారుణమైన హింసాత్మక సన్నివేశాలను జొప్పించాడు. వాస్తవానికి అంత హింస ఈ కథకు అవసరం లేదు. తల నరకడం, అది గాల్లో ఎగరడం, కాళ్ళు చేతులు ముక్కలు చేయడం వంటి సన్నివేశాలు ఎంతో జుగుప్స కలిగించేవిగా ఉన్నాయి. ఒక వ్యక్తి బయోపిక్‌ చేస్తున్నామంటే అది అందరూ చూడదగ్గదిగా ఉండాలి. టైగర్‌ నాగేశ్వరావు జీవితంలో అలాంటి హింసాత్మక ఘటనలు జరిగి ఉండవచ్చు. కానీ, దాన్ని తెరపై మరింత హింసను ప్రేరేపించేవిగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం. ఇప్పటి వరకు రవితేజ కెరీర్‌లో ఇంత హింసతో కూడిన సినిమా చేసి ఉండకపోవచ్చు.  

నటీనటులు :

టైగర్‌ నాగేశ్వరరావుగా రవితేజ ఎంతో ఎఫర్ట్‌ పెట్టి చేశాడు. లుక్‌ కోసం ఎంతో శ్రమించినట్టు తెలుస్తుంది. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా రవితేజకు మంచి మార్కులే పడతాయి. ఆ వయసులోనూ అతని స్పీడ్‌ ఏమాత్రం తగ్గలేదు. హీరోయిన్‌ నుపూర్‌ సనన్‌ కొన్ని సన్నివేశాల్లోనే కనిపించినప్పటికీ ఉన్నంతలో తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత సెకండాఫ్‌లో వచ్చే గాయత్రి భరద్వాజ కూడా ఫర్వాలేదు అనిపించింది. హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్‌ ఓకే అనిపించింది. మురళీశర్మ, అనుపమ్‌ ఖేర్‌, హరీష్‌ పెరాది, జిషు సేన్‌ గుప్తా తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. 

సాంకేతిక నిపుణులు :

సినిమాకి ప్లస్‌ పాయింట్‌గా చెప్పుకోదగింది మధి ఫోటోగ్రఫీ. స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు సినిమాను ఎంతో రిచ్‌ చూపించేందుకు ట్రై చేశాడు. జి.వి.ప్రకాష్‌కుమార్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. అయితే పాటలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. ఎడిటింగ్‌ విషయానికి వస్తే.. ఫస్ట్‌ హాఫ్‌లో, సెకండాఫ్‌లో ల్యాగ్‌ ఎక్కువగా ఉంది. కనీసం మరో 20 నిమిషాలు నిడివి తగ్గించే వీలున్నా ఆ పని చేయలేదు. అందుకే సినిమా నిడివి 3 గంటలు దాటిపోయింది. ఇక దర్శకుడు వంశీ గురించి చెప్పాలంటే.. కథ, కథనాల కంటే వయొలెన్స్‌ మీదే ఎక్కువ దృష్టి పెట్టాడేమో అనిపించింది. అందుకే లెంగ్త్‌ గురించి పట్టించుకోలేదు. ఆర్టిస్టుల నుంచి చక్కగా పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకున్నప్పటికీ హింసాత్మక సన్నివేశాలు, లెంగ్త్‌ సినిమాకి పెద్ద మైనస్‌గా మారాయి. 

తెలుగు వన్‌ పర్‌స్పెక్టివ్‌ : 

టైగర్‌ నాగేశ్వరరావు జీవితంలోని ఘటనలను యధాతథంగా చూపించే ప్రయత్నం చేశారో ఏమోగానీ సినిమా అంతా రక్తపాతమే. నిజంగా అతని జీవితంలో ఇంత హింస జరిగిందా అనే సందేహం కూడా వస్తోంది. ఫస్ట్‌హాఫ్‌ని ఒక డైమెన్షన్‌లో, సెకండాఫ్‌ని మరో డైమెన్షన్‌లో చూపించేందుకు వంశీ చేసిన ప్రయత్నం సక్సెస్‌ అయినప్పటికీ సినిమా నిడివి పెరిగిపోవడం కూడా సినిమా ఆకట్టుకోకపోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. సినిమాకి రవితేజ, రేణు దేశాయ్‌, అనుపమ్‌ ఖేర్‌ వంటి ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ ప్లస్‌ అయింది. అయితే ఇది అందరూ చూడదగ్గ సినిమా కాదు. హింసను ఎక్కువగా ఆస్వాదించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. 

రేటింగ్‌ : 2.25/5

- జి.హరా






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.