![]() |
![]() |
ఎవర్‌గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు దాదాపు 70 సంవత్సరాలపాటు అనేక అద్భుతమైన పాత్రల ద్వారా ప్రేక్షకులను అలరించారు. ఆయన నటించిన చివరి సినిమా ‘మనం’. ఈ సినిమాకి ఎంతో ప్రత్యేకత ఉంది. అక్కినేని ఫ్యామిలీ మూవీగా ఈ చిత్రం సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఎఎన్నార్, నాగార్జున, నాగచైతన్య, అమల, అఖిల్.. ఇలా మూడు జనరేషన్ల హీరోలు ఈ సినిమాలో కనిపించడం అనేది విశేషం. అక్కినేని అభిమానులకు కూడా ఇది ఓ అపురూప చిత్రం. 2014 మే 23న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం తెలుగు సినిమాల రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ సినిమాను తెలుగులో రీరిలీజ్ చెయ్యకుండా జపాన్‌లో రిలీజ్ చెయ్యబోతున్నారు. ఆగస్ట్ 8న ‘మనం’ చిత్రం జపాన్ ప్రేక్షకులను అలరించబోతోంది.
నాగార్జునకు జపాన్‌లో కూడా అభిమానులు ఉన్నారు. అక్కడి అభిమానులు ఆయన్ని ‘నాగ్ సమా’ అని ప్రేమగా పిలుస్తారు. మూడు జనరేషన్ల హీరోలు కనిపించే ‘మనం’ చిత్రాన్ని జపాన్‌లోని చాలా థియేటర్లలో రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా నాగార్జున జపాన్ వెళ్ళబోతున్నారు. మనం ప్రదర్శింపబడుతున్న ఒక థియేటర్‌లో తన ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ కాబోతున్నారు. ఈమధ్యకాలంలో తెలుగు సినిమాలకు జపాన్‌లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ‘మనం’ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేయబోతున్నారు. జపాన్ ప్రేక్షకులు ఫ్యామిలీ, సెంటిమెంట్, ఎమోషనల్ మూవీస్‌ని బాగా ఇష్టపడతారు. ‘మనం’ చిత్రంలో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సినిమా జపాన్‌లోనూ సంచలనం సృష్టించే అవకాశం ఉంది.
![]() |
![]() |