![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్ ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. స్టార్ హీరోగా ఎదిగినప్పటికీ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు. అయితే ఇంతకాలం తన నటనతో సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న తారక్.. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'తో నార్త్ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భీమ్ పాత్రలో తారక్ జీవించాడు. ముఖ్యంగా 'కొమురం భీముడో' సాంగ్ లో తారక్ తన నటనతో కట్టిపడేశాడు. దీంతో హిందీ సినిమాల్లో తారక్ ఛాన్స్ లు వచ్చే అవకాశముందని భావిస్తున్నారంతా. తారక్ సైతం తాను హిందీ సినిమాల్లో నటించడానికి రెడీ అంటున్నాడు.
మార్చి 25 న విడుదలైన 'ఆర్ఆర్ఆర్' భారీ కలెక్షన్స్ తో సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఓ హిందీ యూట్యూబ్ ఛానల్ తారక్ తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ.. తమకి కలెక్షన్స్, నెంబర్స్ కంటే ప్రేక్షకులు, విమర్శకుల నుంచి వస్తున్న ప్రశంసలే ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయని.. నెంబర్స్ అనేవి బోనస్ అని అన్నాడు. తన సినిమాలతో వీలైనంత ఎక్కువమంది ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తానని, నటుడిగా సంతృప్తినిచ్చే చిత్రాలలో భాగమవుతానని తారక్ అన్నాడు.
నటులకు భాషాభేదం ఉండదని, ప్రోపర్ హిందీ ఫిల్మ్ లో నటించాలి అనుకుంటున్నాను అని తారక్ తెలిపాడు. దర్శకులు రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు తనకు నచ్చుతాయని అన్నాడు. హిరానీ సినిమాలు అద్దం ముందు నిల్చొని మనల్ని మనం చెక్ చేసుకున్నట్లు ఉంటాయని అన్నాడు. భన్సాలీ సినిమాలు భారీగా ఉంటాయని, ఆయన సినిమాలో క్యారెక్టర్స్ బలంగా ఉంటాయని కొనియాడారు. వీరితో పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తారక్ తన మనసులో మాట బయటపెట్టాడు.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తారక్ సినిమా గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు తారక్ మాటలని బట్టి చూస్తే త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్ అయినా ఆశ్చర్యం లేదు అనిపిస్తోంది.
![]() |
![]() |