![]() |
![]() |

`గజిని` (2005)తో సంచలనం సృష్టించిన కోలీవుడ్ స్టార్ సూర్య - స్టార్ కెప్టెన్ ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన ద్వితీయ చిత్రం `ఏళామ్ అరివు`. తెలుగులో `సెవెన్త్ సెన్స్` పేరుతో అనువాదమైన ఈ సినిమాలో బోధి ధర్మ, అరవింద్ గా రెండు విభిన్న కాలాలకు చెందిన రెండు వేర్వేరు పాత్రల్లో అలరించారు సూర్య. బయోలాజికల్ వార్ చుట్టూ అల్లుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ మార్షల్ ఆర్ట్స్ మూవీలో మెడికల్ స్టూడెంట్ పాత్రలో కనిపించారు శ్రుతి హాసన్. జానీ ట్రై, అభినయ, ధన్య బాలకృష్ణన్ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
కథాంశం విషయానికి వస్తే.. ఆరవ శతాబ్దానికి చెందిన పల్లవ రాజు బోధి ధర్మ (సూర్య).. మార్షల్ ఆర్ట్స్, చరకసంహిత (వైద్య శాస్త్రం)ని ఔపాసన పట్టిన గొప్ప వ్యక్తి. తన గురువు ఆజ్ఞ మేరకు చైనా వెళ్ళి అక్కడ విచిత్రమైన వ్యాధితో ఇబ్బందిపడుతున్న ఓ గ్రామాన్ని రక్షిస్తాడు. అలాగే, ఆ ఊరి ప్రజలను దుష్టుల నుంచి కాపాడడమే కాకుండా మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాడు. షావోలిన్ గుడి నిర్మించి అనూహ్య పరిస్థితుల్లో అక్కడే కాలం చేస్తాడు. కట్ చేస్తే.. 21వ శతాబ్దం. బయో వార్ తో ఇండియాని తన గుప్పిట్లో ఉంచుకోవాలనుకుంటుంది చైనా. ఈ క్రమంలోనే డోంగ్ లీ (జానీ ట్రై) అనే వశీకరణ విద్య తెలిసిన మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిని ఇండియాకి పంపిస్తుంది చైనా. ఈ నేపథ్యంలో.. బోధి ధర్మ డి.ఎన్.ఎ.పై పరిశోధనలు చేస్తున్న మెడికల్ స్టూడెంట్ శుభ శ్రీనివాసన్ (శ్రుతి హాసన్).. అతని వంశీయుడైన సర్కస్ ఆర్టిస్ట్ అరవింద్ (సూర్య) సహాయంతో ఈ బయో వార్ కి ఎలా అడ్డుకట్ట వేసిందన్నదే `సెవెన్త్ సెన్స్` చిత్రం. బోధి ధర్మ ఎపిసోడ్, బయో వార్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ లో ఈ చిత్రంలోని కథాంశం మరోసారి వెలుగులోకి రావడం విశేషం.
ఇక పాటల విషయానికి వస్తే హేరిస్ జైరాజ్ సంగీతసారథ్యంలో భువనచంద్ర సాహిత్యంతో రూపొందిన ``ముత్యాల ధారని``, ``అమ్మ అమ్మ`` గీతాలు ఆకట్టుకున్నాయి. దీపావళి కానుకగా 2011 అక్టోబర్ 26న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను విశేషంగా అలరించిన `సెవెన్త్ సెన్స్`.. నేటితో పదేళ్ళు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |