![]() |
![]() |
ఒకప్పటి సినిమాల్లో ఎవరు యాక్ట్ చేస్తారో వాళ్లే డబ్బింగ్ చెప్పేవారు. ఆ తర్వాతి కాలంలో పరభాషా నటులు రావడంతో వారికి ఖచ్చితంగా వేరే ఆర్టిస్ట్‌తో డబ్బింగ్ చెప్పించేవారు. ఇప్పుడు కొందరు తెలుగు నటీనటులు కూడా డబ్బింగ్ ఆర్టిస్టులను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే తండ్రికి కొడుకు డబ్బింగ్ చెప్పడం మనం ఎక్కడైనా చూశామా? ఇప్పుడు టాలీవుడ్‌లో అదే జరిగింది. కొందరు నటీనటులు చాలా లేటు వయసులో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయాలు సాధిస్తుంటారు. అలాంటి వారు సినిమా పరిశ్రమ పుట్టిన నాటి నుంచీ ఉన్నారు. లేటెస్ట్‌గా గోపరాజు రమణ కూడా అలాగే చాలా లేట్‌గా పరిశ్రమకు పరిచయమయ్యారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంలోని ఆయన నటనను అందరూ ఆదరించారు. ఆ సినిమా 2020లో విడుదలైంది. ఈ నాలుగేళ్ళలో రమణ చాలా సినిమాల్లో నటించారు. కొన్ని నెలల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు.
అప్పటివరకు ఆయన పూర్తి చేసిన చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. కానీ, డబ్బింగ్ చెప్పే పరిస్థితుల్లో ఆయన లేకపోవడంతో ఆయా చిత్ర నిర్మాతలు టెన్షన్ పడ్డారు. రమణ పాత్రకు వేరొకరితో డబ్బింగ్ చెప్పిస్తే సూట్ అవ్వదని గ్రహించిన నిర్మాతలు రమణ కుమారుడు గోపరాజు విజయ్‌తో డబ్బింగ్ చెప్పిస్తున్నారు. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతని వాయిస్ తండ్రి వాయిస్‌కి దగ్గరగా ఉండడంతో పెద్ద తేడా తెలియడం లేదు. ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో కూడా రమణ చేసిన పాత్రకు విజయ్ వాయిస్ ఇచ్చారు. అంతేకాదు, స్వాగ్, కమిటీ కుర్రాళ్లు వంటి ఐదు సినిమాల్లో రమణ కీలక పాత్రలు పోషించారు. వాటన్నింటికీ విజయ్‌తోనే డబ్బింగ్ చెప్పించడం విశేషం. సర్జరీ తర్వాత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న రమణ.. త్వరలోనే మళ్ళీ తన నటనను కొనసాగించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితే కన్నడ పరిశ్రమలో పునీత్ రాజ్‌కుమార్ చనిపోయినపుడు ఎదురైంది. ఆయన చనిపోయే సమయానికి చాలా సినిమాలు డబ్బింగ్ దశలో ఉన్నాయి. వాటిలో కొన్ని సన్నివేశాలు బ్యాలెన్స్ ఉండడంతో పునీత్ అన్నయ్య శివరాజ్‌కుమార్ డబ్బింగ్ చెప్పారు. అతని వాయిస్ కూడా పునీత్ వాయిస్‌కి దగ్గరగా ఉండడంతో ఎంతో సహజంగా పునీత్ డబ్బింగ్ చెప్పినట్టుగానే ఉందట.
![]() |
![]() |