![]() |
![]() |

సంజయ్ దత్ ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతూ, చికిత్సను ప్రారంభించి కొంత కాలం గడిచింది. ఈ వార్త లక్షలాది మంది ఆయన అభిమానుల హృదయాలను బద్దలు చేసింది. అందరూ ఆయన శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ వస్తున్నారు. ఆ ప్రార్థనలను దేవుడు విన్నట్లు కనిపిస్తోంది.. ఎందుకంటే బాలీవుడ్ మున్నాభాయ్ కేన్సర్‌ను జయించాడు. నిజమే. కేన్సర్‌తో జరిపిన పోరాటంలో సంజయ్ దత్ విజయం సాధించాడు. బుధవారం తన పిల్లలు షహ్రాన్, ఇక్రా పదో బర్త్‌డే సందర్భంగా ఈ శుభవార్తను ఆయన పంచుకున్నాడు. ఇది తను వారికిస్తున్న బెస్ట్ గిఫ్ట్‌గా పేర్కొన్నాడు.
తన అభిమానులకు కృతజ్ఞతా పూర్వకంగా ఓ నోట్‌ను షేర్ చేశాడు సంజయ్. "గడచిన కొన్ని వారాలు నా ఫ్యామిలీకి, నాకు చాలా గడ్డు కాలం. పెద్దలు చెప్పినట్లుగా దేవుడు తన బలమైన సైనికులకే కష్టతరమైన యుద్ధాలనిస్తాడు. ఈ రోజు నా పిల్లల బర్త్‌డే సందర్భంగా, ఈ యుద్ధం నుంచి విజేతగా బయటపడినందుకు, వాళ్లకు నేనివ్వగల బెస్ట్ గిఫ్ట్ - నా కుటుంబానికి ఆరోగ్యాన్నీ, శ్రేయస్సునూ ఇవ్వగలిగినందకూ సంతోషంగా ఉన్నాను. మీ అందరి అంచంచల విశ్వాసం, సపోర్ట్ లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ క్లిష్ట సమయంలో నాకు అండగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులు, అభిమానులందరికీ మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నా వేపు మీరు పంపిన ప్రేమ, దయ, లెక్కలేనన్ని ఆశీర్వాదాలకు ధన్యవాదాలు" అని ఆయన రాసుకొచ్చాడు.
తనను బాగా చూసుకున్నందుకు డాక్టర్లకు కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశాడు. "ఈ రోజు ఈ న్యూస్‌ను పంచుకుంటుంటే నా హృదయం మీపై కృతజ్ఞతా భావంతో నిండిపోతోంది. థాంక్యూ" అని చెప్పాడు సంజయ్ దత్.
![]() |
![]() |