![]() |
![]() |
.jpg)
'పవర్ స్టార్' ట్రైలర్‌ను జూలై 22 ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నాననీ, ఎవరైనా దాన్ని చూడాలంటే 25 రూపాయలు చెల్లించాలనీ రామ్‌గోపాల్ వర్మ ప్రకటించడం మనకు తెలిసిందే. కానీ ఆయన ప్లాన్ తుస్ అంది. ఆయన థియేటర్లో కంటే ముందుగానే ఆ ట్రైలర్ లీకయింది. తన ఆఫీస్ స్టాఫ్‌లో ఎవరో ఒకరి వల్ల అది లీకయ్యిందని అనుమానిస్తున్నట్లు తన ట్విట్టర్ అకౌంట్‌లో ఆర్జీవీ చెప్పారు. ఇప్పటిదాకా ట్రైలర్ చూడడం కోసం డబ్బు కట్టినవాళ్లకు వీలైనంత త్వరలో తిరిగి చెల్లించేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
"ఈ చిత్రం ప్రవన్ కల్యాణ్ ఫాన్స్‌కి అంకితం" అంటూ 4 నిమిషాల నిడివి ఉన్న 'పవర్ స్టార్' ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. అంటే ఇందులో మెయిన్ క్యారెక్టర్‌కు ప్రవన్ కల్యాణ్ అనే పేరు పెట్టాడు ఆర్జీవీ. రివాల్వింగ్ చైర్‌లో కూర్చొని తాపీగా పుస్తకం చదువుతూ మనకు ప్రవన్ కల్యాణ్ దర్శనమిచ్చాడు. ఆ వెంటనే టైటిల్ లోగోలో పెట్టిన టీ గ్లాస్‌ను గోడకి టచ్ చేస్తూ కనిపించాడు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రాత్రి ఒంటరిగా తన ఇంట్లో టీవీ చూస్తున్నాడు ప్రవన్. ఆ న్యూస్‌లో రెండు సీట్లలోనూ ఆయన ఓటమి దిశగా పయనిస్తున్నట్లు చెప్పారు.
చేగువేరా ఫొటో బ్యాగ్రౌండ్‌లో కనిపిస్తుండగా "ఒక్క సీటు కూడా రాలేదా?" అని ప్రవన్ ఆవేదనగా అంటుంటే, అనుచరుడు "ఒక్కటొచ్చింది సార్. మీకు ఒక్కటి కూడా రాలేదు" అని చెప్పాడు. దాంతో ఆవేశం తట్టుకోలేక టీవీ సహా ఆ హాల్లో ఉన్న వస్తువులని విసురుగా కింద పడేశాడు ప్రవన్. సీన్ మారింది. తన దగ్గరకు క్యాప్ పెట్టుకొని వచ్చిన వ్యక్తి చెంప మీద కొట్టి, "ఒక్క స్పీచ్ కూడా వర్కవుట్ కాలేదు. అయినా ఒక్క సీట్ ఏంటిరా.. ఛ" అని అతని చొక్కా కాలర్ పట్టుకున్నాడు.
సీన్ కట్ చేస్తే.. ప్రవన్ అన్న రంగంలోకి వచ్చాడు. "ఒక్కసారి నీ గుండెల మీద చెయ్యేస్కొని చెప్పరా. నువ్వు పవర్ స్టార్ అయ్యింది కానిస్టేబుల్ కొడుగ్గానా, లేక నా తమ్ముడి గానా?" అని ప్రశ్నించాడు. నోటి మీద చెయ్యి పెట్టుకొని ఆలోచనలో పడ్డాడు ప్రవన్.
ఈసారి ప్రవన్‌ను నైట్ ఎఫెక్ట్‌లో బాబు వచ్చి కలిశాడు. "సత్య ప్రమాణకంగా చెప్తున్నాను బ్రదర్. మీరు ఓడిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను" అన్నాడు. "మిమ్మల్ని నమ్మొద్దు నమ్మొద్దు అని చాలామంది చెప్పారు. మీకో దణ్ణం స్వామీ" అని దణ్ణం పెట్టాడు ప్రవన్. "ప్లీజ్ సర్ బయల్దేరండి" అని బయటకు వెళ్లమంటూ విసురుగా చేయి చూపించాడు. అతని వంక చూస్తూ బయటకు నడిచాడు బాబు.
నైట్ ఎఫెక్ట్‌లోనే ఉన్నాడు ప్రవన్.. తన స్పీచ్‌లకు, తన హావభావాలకు, తన చేష్టలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో అనుచరుడి దగ్గర ఏకరువు పెట్టి, అది చూసి తాను అదైపోతాను, ఇదైపోతాను అని ఊహించుకుంటే చివరకు ఇలా ఏదీ కాకుండా మిగిలిపోవడమేంటని తనను తానే ప్రశ్నించుకున్నాడు.
ప్రవన్‌తో ఫిల్మ్ క్రిటిక్ మహేశ్ కత్తి భేటీ అయ్యాడు. "మీరు ఎన్నికల ప్రచారంలో 'గగన్ సీఎం కాడు.. ఇది నా శాసనం' అని బాహుబలిలో శివగామి రేంజిలో రంకెలేశారు. ఇప్పుడు చూస్తే పరిస్థితి మారిపోయింది. దీనికి మీరేమంటారు?" అని అడిగాడు. ఉయ్యాల మీద కూర్చున్న ప్రవన్ తన మేనరిజమ్ అయిన జుట్టును చేత్తో పైకి ఎగదీసుకుంటూ, "ఎన్నికల ముందు మా లీడర్లు ఏవేవో అనుకుంటాం. అవన్నీ పట్టించుకోడానికి జనానికి బుద్ధుండక్కర్లా" అని జవాబిచ్చాడు.
సీన్.. ఫామ్‌హౌస్‌కి వెళ్లింది. ఎవరో గడ్డి పీకుతున్న చోటి నుంచీ కెమెరా జూమ్ చేస్తూ ఫోన్‌లో మాట్టాడుతున్న ప్రవన్ మీదికెళ్లింది. ఆ ఫోన్‌లో ప్రవన్ మరో అన్నయ్య మాట్లాడుతున్నాడు. "నిన్ను కానీ, అన్నయ్యను కానీ ఒక్కమాటంటే ఊరుకొనేది లేదు. అసలేమనుకుంటున్నావో. నువ్వు ప్యాకేజ్ స్టార్‌వనీ, అసమర్థుడవనీ, గుండు సున్నావనీ, తెలివిలేదనీ, తెలీదనీ అందరూ నోటికొచ్చినట్టు వాగుతుంటే నాకు పిచ్చ కోపమొస్తోంది తమ్ముడూ" అని బాధపడ్డాడు. "వాళ్లు అనిందేమో కానీ, నువ్వు మళ్లీ ఇలా ఫోన్‌చేసి ఆ తిట్టన్నీ గుర్తుచెయ్యడం ఇప్పుడవసరమా?" అనడిగాడు ప్రవన్.
కళ్లకు నల్లటి గాగుల్స్ పెట్టుకొని ఫామ్‌హౌస్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక ప్రొడ్యూసర్. పైజమాని కాస్త పైకి మడిచి నడుచుకుంటూ వస్తున్న ప్రవన్ కల్యాణ్ కాళ్లకు దణ్ణం పెట్టాడు. అతడిని వారిస్తూ, "ఏంట్రా ఇలా వచ్చావ్?" అనడిగాడు ప్రవన్. "మీరు ఎలక్షన్‌లో ఓడిపోతే వంద కొబ్బరికాయలు కొట్టి మీ పేరుమీద గుళ్లో అర్చన చేయిస్తానని మొక్కుకున్నా" అని పగలిన కొబ్బరికాయను చూపించాడు. "బాబూ.. మీరు గెలిచి సీఎం అయితే సినిమాలు చెయ్యరు బాబూ. నేను ప్రొడ్యూసర్‌గా మీరు తప్ప ఎవరూ నాతో సినిమాలు చెయ్యరు. అప్పుడు నా బతుకు బస్టాండ్ అయిపోతుంది బాబూ" అని అతను చెప్తుంటే చిద్విలాసంగా విన్నాడే కానీ ఆవేశపడలేదు ప్రవన్.
సీన్ ఇంటికి మారింది.. రష్యన్ భార్య రష్యన్ భాషలో ప్రవన్‌తో మాట్లాడుతుంటే, బాడీగార్డ్ వచ్చి "పూనే నుంచి ఫోన్ వచ్చింది సాబ్" అంటూ ఫోన్ ఇవ్వబోయాడు. ఓ చేతిలోని పుస్తకాన్ని చదువుతూ, మరో చేతిలోని భార్య ఇచ్చిన టీని తాగుతూ.. భార్య ఏదో సీరియస్‌గా అడుగుతుంటే, అంతే సీరియస్‌గా పుస్తకాన్ని కింద పడేసి, "నేను కాదు కదా ఫోన్ చేసింది" అన్నాడు ప్రవన్.
మళ్లీ నైట్ ఎఫెక్ట్.. కుర్చీలో కూర్చొని ఇంతకీ నేనసలు రాజకీయాల్లో ఉండాలా, వొదిలెయ్యాలా? అన మధనపడుతున్నాడు ప్రవన్. "భోళ శంభో.. భోళ శంభో" అనే రీరికార్డింగ్ హై పిచ్‌లో వినిపిస్తుండగా.. వెనుక నుంచి నెమ్మదిగా ఒక వ్యక్తి.. వచ్చాడు.. రామ్‌గోపాల్ వర్మలా ఉన్నాడు. అక్కడి మెట్లమీద కూర్చున్నాడు. అతని చేతిలో వాటర్ బాటిల్ ఉంది. ప్రవన్ అతడిని గమనించలేదు. సో.. ప్రవన్ ప్రశ్నకు అతని వద్ద ఆన్సర్ ఉందన్న మాట.
మొత్తం సినిమాని జూలై 25న ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో చూపిస్తానని రామ్‌గోపాల్ వర్మ చెప్పాడు.
4 నిమిషాల ట్రైలర్ చూస్తుంటేనే పవన్ కల్యాణ్‌పై ఒకదాని తర్వాత ఒకటిగా సెటైర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే. కావాలని "ఈ చిత్రం ప్రవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అంకితం" అంటూ పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్నాడు వర్మ. ట్రైలర్ బయటకు రాగానే ఆయన ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. నేటి యంగ్ హీరోల్లో పవన్ ఫ్యాన్స్ కూడా చాలామందే ఉన్నారు. నిఖిల్ అయితే ఆర్జీవీని కుక్కతో పోల్చేశాడు. ఇప్పటికే ఆర్జీవీపై నాలుగు సినిమాలను పవన్ ఫ్యాన్స్ అనౌన్స్ చేశారు. ఇప్పట్నుంచీ వాళ్లు ఇంకే రీతిలో స్పందిస్తారనేది చూడాల్సిందే.
రాజ్యాంగం కల్పించిన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్సెప్రెషన్‌ను రామ్‌గోపాల్ వర్మ దుర్వినియోగం చేస్తున్నాడంటూ పవన్ ఫ్యాన్స్ ఆయనను తూర్పారబడుతున్నారు. చట్టాల గురించి బాగా తెలిసిన ఆర్జీవీ మాత్రం ఆ చట్టాలకు దొరక్కుండా తను తియ్యాలనుకున్న సినిమాలను తీస్తూ, తను చెప్పాలనుకున్న విషయాలను చెప్తూ పోతున్నారు. ఆయనను అడ్డుకునేవాళ్లు కనుచూపు మేరలో కనిపించడం లేదు.
![]() |
![]() |