![]() |
![]() |
ఒక సినిమా రిలీజ్ అవుతోందంటే.. నెల రోజుల ముందు నుంచీ రకరకాల కాన్సెప్ట్స్‌తో సినిమాను జనంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు మేకర్స్. టీవీ ఛానల్స్ మొదలైన నాటి నుంచి మీడియా ఇంతగా విస్తరించిన కాలం వరకు చిత్ర యూనిట్‌తో ఇంటర్వ్యూలు చెయ్యడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ఒకవిధంగా జనానికి ఇది బోర్ సబ్జెక్ట్ అనే అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. సినిమా బాగుంది అనే టాక్ వస్తే మౌత్ పబ్లిసిటీని మించింది ఉండదు, అదే జనాన్ని థియేటర్స్ దక్కరికి లాక్కొస్తుంది అనేది ఎన్నో సినిమాల విషయంలో ప్రూవ్ అయింది. ఇలాంటి ఇంటర్వ్యూలు జనానికే కాదు, ఆయా సినిమాల్లో నటించిన ఆర్టిస్టులకు కూడా బోర్ కొట్టిస్తాయని, చిరాకు తెప్పిస్తాయని సుమ చేసిన ఓ ఇంటర్య్వూ వల్ల తేలింది.
రవితేజ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి దర్శకుడు హరీష్ శంకర్. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకుముందు షాక్, మిరపకాయ చిత్రాలు వచ్చాయి. దీంతో ప్రేక్షకుల్లో, చిత్ర యూనిట్‌లో ఈ సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా ప్రమోషన్ మామూలే కాబట్టి ఇటీవల రవితేజ, భాగ్యశ్రీ బోర్సేలను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు యాంకర్ సుమ. ఇందులో సుమ అడిగిన కొన్ని ప్రశ్నలకు రవితేజ ఇబ్బంది పడడమే కాదు, కొంత ఇరిటేట్ అయ్యాడు కూడా. ఈ ఇంటర్వ్యూలో సుమ ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ‘మిస్టర్ బచ్చన్ చిత్రంలో వింటేజ్ రవితేజను చూస్తారని హరీష్ శంకర్ అన్నారు. అంటే వెంకీ, విక్రమార్కుడు, ఇడియట్.. వీటిలో ఏ సినిమా వింటేజ్‌లో మిస్టర్ బచ్చన్ ఉంటుంది’ అని అడిగింది.
దానికి రవితేజ ఒక్క మాటలో ‘హరీష్ శంకర్ వింటేజ్’ అని సమాధానమిచ్చాడు. సుమ అక్కడితో ఆగకుండా మీ ఇద్దరి కాంబినేషన్‌లో ‘షాక్, మిరపకాయ వచ్చాయి. ఈ రెండిరటిలో ఏ వింటేజ్‌లో మిస్టర్ బచ్చన్ ఉంటుంది’ అని అడిగింది. దానిక్కూడా ‘మిరపకాయ’ అంటూ ఒక్క మాటలో చెప్పాడు. దానికి సుమ ‘మీరు అన్నీ ఒక్కమాటలో చెప్పేస్తున్నారు’ అంటూ కాస్త సీరియస్‌గా అన్నారు. ‘అంటే మీకు ఇప్పుడు కథ మొత్తం చెప్పెయ్యాలా?’ అంటూ తను కూడా సీరియస్ అయినట్టు నటిస్తూ అన్నారు రవితేజ. దానికి సుమ ‘సుమ మీద సీరియస్ అయిన రవితేజ.. అని థంబ్ నెయిల్ వేసుకోండి’ అంటూ సుమ సరదాగా అన్నారు. నిజానికి సుమ వేసిన ప్రశ్నలో, రవితేజ చెప్పిన సమాధానంలో ఎక్కడా సీరియస్‌నెస్ లేకపోయినా ఈ వీడియోను డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఇలాంటివి కూడా సినిమా పబ్లిసిటీకి ఉపయోగపడతాయనే కొత్త విషయాన్ని మిస్టర్ బచ్చన్ మేకర్స్ గుర్తించినట్టున్నారు. అందుకే ఈ వీడియోను బాగా వైరల్ చేస్తున్నారు. ‘రవితేజ అలా రియాక్ట్ అవ్వడంలో ఏం తప్పులేదు. ఎందుకంటే ఈమధ్యకాలంలో ప్రమోషన్ కోసం చేస్తున్న ఇలాంటి ఇంటర్వ్యూలు ఎంత బోరింగ్‌గా ఉంటున్నాయో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఇవి వర్కవుట్ అయ్యేవేమోగానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఇలాంటివన్నీ సోషల్ మీడియా స్టఫ్ కోసమే తప్ప ప్రేక్షకుల్ని థియేటర్స్ రప్పించడానికి ఎంత మాత్రం ఉపయోగపడవు..’ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
![]() |
![]() |