![]() |
![]() |

డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh)కి ఎందరో అభిమానులున్నారు. వారిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad)కి కూడా పూరి అంటే అభిమానం. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే గతంలో వెల్లడించారు. అయితే విజయేంద్రప్రసాద్ చేసిన ఓ పనికి తాను ఎమోషనల్ అయినట్లు తాజాగా ఒక ఆసక్తికర సంఘటనను పూరి షేర్ చేసుకున్నారు.
రామ్ పోతినేని హీరోగా పూరి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart). రామ్-పూరి కలయికలో లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ ఆగష్టు 15న థియేటర్లలో అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా పూరి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు.
"నా గత చిత్రం లైగర్ ఫ్లాప్ అయ్యాక, విజయేంద్రప్రసాద్ గారు ఫోన్ చేసి.. ఒక హెల్ప్ కావాలని అడిగారు. ఆయన కొడుకు రాజమౌళి గారే పెద్ద డైరెక్టర్.. అలాంటిది నన్ను హెల్ప్ అడుగుతున్నారేంటి అనుకున్నాను. అప్పుడు ఆయన మీరు నెక్స్ట్ సినిమా చేసేముందు ఒకసారి నాకు కథ వినిపించండి. ఎందుకంటే మీ లాంటి డైరెక్టర్స్ ఫెయిల్ అవ్వడం నాకిష్టం లేదు అన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో అలా అన్నారో నాకు అర్థమైంది. ఆయన నాపై చూపించిన ప్రేమకు చాలా ఎమోషనల్ అయిపోయాను. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ సినిమా చేశాను. కథ చెప్పడం కాదు, ఒక మంచి సినిమా చేసి ఆయనకు చూపించాలి అనుకున్నాను. లవ్ యూ సార్." అంటూ విజయేంద్రప్రసాద్ ఫోన్ కాల్ తనలో ఎంత మార్పు తీసుకొచ్చిందో చెప్పుకొచ్చారు పూరి.
![]() |
![]() |