![]() |
![]() |

థియేటర్లు మూతపడిన కాలంలో ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ బిజీగా ఉంటున్న వ్యక్తి ఎవరంటే.. ఒక్క రామ్‌గోపాల్ వర్మ పేరే చెబుతున్నారు. మిగతా అందరూ ఇళ్లల్లో ఉండి కాలక్షేపం కోసం తామేం పనులు చేస్తున్నారో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటుంటే వర్మ మాత్రం ఇదివరకటి కంటే మరింత ఉధృతంగా సినిమాలు తీసుకుంటూ పోతున్నారు. వాటిని ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే ఏటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తూ డబ్బులు గడిస్తున్నారు. ఆ విధంగా 'క్లైమాక్స్', 'నగ్నం' అనే చిత్రాలతో ఖర్చుకు పదింతలు ఆర్జించారు.
కొద్ది రోజుల క్రితం 'పవర్‌స్టార్' అనే మూవీని అనౌన్స్ చేసి, వాటికి సంబంధించిన పిక్చర్స్ షేర్ చేస్తూ, అందరి అటెన్షన్ పడేట్లు కామెంట్లు పెడుతూ పబ్లిసిటీ చేసుకుంటూ వస్తున్నారు. దాంతో ఆ సినిమా ఒక సెన్సేషనల్ ఇష్యూ అయ్యింది. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 'పవర్‌స్టార్' షూటింగ్‌ను ఆయన కంప్లీట్ చేసేశారు. దీని కోసం ఆయన తీసుకున్న టైమ్ రెండు వారాలు కూడా లేదు. "ఎన్నికల ఫలితాల తర్వాత కథ" అంటూ పొలిటికల్ ప్లస్ సినిమా బ్యాక్‌డ్రాప్‌లో ఆ మూవీని తీస్తున్న అభిప్రాయాన్ని కలిగించారు. పవన్ కల్యాణ్ మీదే ఆ సినిమా తీస్తున్నట్లు ఆయన పోస్టులు స్పష్టంగా తెలియజేస్తున్నా, ఆయన మాత్రం కాదంటున్న విషయం చూస్తున్నాం.
మొదట ఈ నెలలోనే ఈ సినిమాని ఆయన రిలీజ్ చేస్తారని వినిపించగా, ఇప్పుడు ఆగస్ట్‌లో రిలీజ్ చేయనున్నట్లు వినిపిస్తోంది. ఈ సినిమాపై తన ఫ్యాన్స్ ఆవేశంగా స్పందించడం చూసిన పవన్ కల్యాణ్ వారిని వారిస్తూ ఆర్జీవీ మూవీ విషయంలో మౌనంగా ఉండమనీ, మహా అయితే దాని గురించి ఒకట్రెండు రోజులు మాట్లాడుకుంటారనీ, ఆ తర్వాత దాని గురించి ఎవరూ పట్టించుకోరనీ సూచించారు.
![]() |
![]() |