![]() |
![]() |

జూలై 10న 'బాహుబలి: ద బిగినింగ్' మూవీ విడుదలై ఐదేళ్లు గడిచిన సందర్భంగా వచ్చిన 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకుంది. ఆ పోస్టర్ పలు సినిమాల పోస్టర్లకు కాపీ అంటూ వచ్చిన విమర్శలను తట్టుకొని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై రికార్డ్ స్థాయిలో ట్వీట్స్, లైక్స్ దానికి వచ్చాయి. ఆ పోస్టర్‌లో హీరో హీరోయిన్లు ప్రభాస్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉందని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించేశారు.
యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే పోస్టర్‌లో అందరినీ ఆశ్చర్యపరచిన విషయం మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో వెల్లడించకపోవడం. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్ వంటి ఇతర టెక్నీషియన్ల పేర్లు వెల్లడించినప్పటికీ, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఇంకా పెండింగ్‌లో ఉందనే విషయం ఆ పోస్టర్ ద్వారా తెలిసింది. ఇప్పటికే సగం పైగా చిత్రీకరణ జరిగిన సినిమాకు సంగీత దర్శకుడెవరో కన్‌ఫామ్ కాకపోవడం విచిత్రమే.
'రాధే శ్యామ్' లవ్ స్టోరీ కాబట్టి, ఆ తరహా సినిమాలకు ట్యూన్స్ కట్టడంలో దేశంలోనే నంబర్‌వన్‌గా పేరుపొందిన ఎ.ఆర్. రెహమాన్‌ను తీసుకోవాలనేది ప్రభాస్ కోరిక అని తెలుస్తోంది. ఇప్పటికే దర్శక నిర్మాతలు ఆయనను సంప్రదించారనీ, అయితే ఇప్పటి వరకూ ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించలేదనీ సమాచారం. ఇప్పటికే తనకున్న కమిట్‌మెంట్స్‌తో రెహమాన్ బాగా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అందుబాటులో లేకపోతే బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను ఎవరినైనా తీసుకోవచ్చని వినిపిస్తోంది.
గమనించాల్సిన అంశమేమంటే 'సాహో' సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ వ్యవహారం వార్తల్లో నిలవడం. మొదట శంకర్-ఎహ్‌సాన్-లాయ్‌ను తీసుకుంటే, క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో వాళ్లు తప్పుకున్నారు. దాంతో మరో నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లతో పని చేయించుకున్నారు. మరిప్పుడు 'రాధే శ్యామ్' విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
![]() |
![]() |