![]() |
![]() |

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కలయికలో పలు మరపురాని చిత్రాలు రూపొందాయి. వాటిలో `ప్రేమాభిషేకం` ఒకటి. మ్యూజికల్ సెన్సేషన్ గా నిలిచిన ఈ రొమాంటిక్ డ్రామా.. అప్పట్లో పలు సరికొత్త రికార్డులను సృష్టించింది.
ఏయన్నార్ కి జోడీగా శ్రీదేవి, జయసుధ నటించిన ఈ చిత్రంలో మురళీమోహన్, మోహన్ బాబు, కవిత, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, నిర్మలమ్మ, మాస్టర్ హరీశ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
దిగ్గజ స్వరకర్త చక్రవర్తి సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. `నా కళ్ళు చెబుతున్నాయి`, `దేవీ మౌనమా`, `ఓ దేవుని గుడిలో`, `వందనం అభివందనం`, `తారలు దిగివచ్చిన వేళ`, `కోటప్ప కొండ`, `ఆగదు ఆగదు`.. ఇలా ఇందులోని ప్రతీ పాట ఓ ఆణిముత్యమే.
తమిళంలో `వాళవే మాయమ్`, హిందీలో `ప్రేమ్ తపస్య`, ఒరియాలో `ప్రథమ ప్రేమ` పేర్లతో `ప్రేమాభిషేకం` రీమేక్ అయింది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని నిర్మించిన ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్.. 1981 ఫిబ్రవరి 18న విడుదలైంది. నేటితో ఈ సంచలన చిత్రం.. 40 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
![]() |
![]() |