![]() |
![]() |

పరిమిత బడ్జెట్ లో సూపర్ హీరో ఫిల్మ్ ని అద్భుతంగా తెరకెక్కించాడని 'హనుమాన్'(Hanuman) దర్శకుడు ప్రశాంత్ వర్మపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో నందమూరి బాలకృష్ణ మాత్రం ప్రశాంత్ వర్మ(Prashanth Varma)కి క్లాస్ పీకాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రశాంత్ రివీల్ చేయడం విశేషం.
చిన్న పెద్ద అనే తేడా లేకుండా బాలకృష్ణ(Balakrishna) అందరితో ఎంతో సరదాగా ఉంటాడు. ఈ విషయం 'అన్ స్టాపబుల్' షో కారణంగా అందరికీ అర్థమైంది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వర్క్ చేస్తున్నాడు. ఈ షో కారణంగా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ప్రశాంత్ ని బాలయ్య సరదాగా ఆటపట్టిస్తుంటాడు కూడా. అన్ స్టాపబుల్ షో షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ని తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ప్రశాంత్ వర్మ.
అన్ స్టాపబుల్ షో షూట్ సమయంలో సరదాగా మాట్లాడుతూ "ఏం సినిమా చేస్తున్నావు?" అని బాలయ్య అడగగా.. "హనుమాన్" అని ప్రశాంత్ చెప్పాడట. తర్వాత సీజన్ లో కూడా "ఏం చేస్తున్నావు?" అని బాలయ్య అడగగా.. మళ్ళీ "హనుమాన్" అనే ప్రశాంత్ సమాధానమిచ్చాడట. మళ్ళీ కొంతకాలానికి కలిసినప్పుడు బాలయ్య మాటల్లో సినిమాల ప్రస్తావన తీసుకురాగా.. ప్రశాంత్ ఎప్పటిలాగే "హనుమాన్" అని ఆన్సర్ ఇచ్చాడట. దీంతో బాలకృష్ణ "ఏంటయ్యా నువ్వు ఎప్పుడు అడిగినా హనుమాన్ అంటావు. అసలు ఒక సినిమా ఎన్నిరోజులు తీస్తావు" అని నవ్వుకుంటూ అన్నాడట. ఈ విషయాన్ని తెలుగువన్ ఇంటర్వ్యూలో సరదాగా షేర్ చేసుకున్నాడు ప్రశాంత్.
కాగా బాలయ్యపై ప్రశాంత్ ప్రత్యేక అభిమానాన్ని చూపుతుంటాడు. 'హనుమాన్' విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న తర్వాత.. బాలకృష్ణ కోసం ప్రత్యేక షో వేశాడు. చిత్రాన్ని చూసి ప్రశాంత్ ని ప్రశంసించాడు బాలయ్య. అంతేకాదు వీరి కలయికలో సినిమా కూడా రానుంది. ఇప్పటికే బాలకృష్ణకి రెండు కథలు వినిపించాడు ప్రశాంత్.
![]() |
![]() |