![]() |
![]() |

టాలీవుడ్ లో ఉన్న బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబో ఒకటి. వీరి కలయికలో ఇప్పటిదాకా 'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి ఘన విజయాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు ఒక దానిని మించి ఒకటి విజయం సాధించాయి. ముఖ్యంగా 2021 డిసెంబర్ లో లాక్ డౌన్ సమయంలో వచ్చిన 'అఖండ' సంచలనాలు సృష్టించింది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. అఘోరా పాత్రలో అయితే నట విశ్వరూపం చూపించాడు. అసలు అప్పుడు ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా ప్రమోట్ చేసి రిలీజ్ చేసినట్లయితే.. నేషనల్ వైడ్ గా సంచలనాలు సృష్టించేదనే అభిప్రాయాలున్నాయి. అయితే త్వరలో 'అఖండ-2'తో ఆ అభిప్రాయాలు నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది.
'అఖండ' తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో 'అఖండ-2' ఉంటుందని వార్తలొచ్చాయి. బోయపాటి సైతం 'అఖండ-2' చేయనున్నట్లు తెలిపాడు. కానీ ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. 'అఖండ' తర్వాత 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాలతో వరుస విజయాలను అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తన 109వ(NBK 109) సినిమాని చేస్తున్నాడు. మరోవైపు బోయపాటి 'స్కంద' రూపంలో షాక్ తిన్నాడు. ఆయన తదుపరి సినిమా అల్లు అర్జున్, సూర్య వంటి హీరోలతో ఉండే అవకాశముందని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం బోయపాటి దృష్టి అంతా 'అఖండ-2' పైనే ఉందట.
ప్రస్తుతం 'అఖండ-2'కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. 'అఖండ-2'ని భారీ స్థాయిలో రూపొందించనున్నారట. ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించనున్నారని సమాచారం. అసలే బాలయ్య-బోయపాటి కాంబినేషన్, దానికి తోడు 'అఖండ'కి సీక్వెల్ కావడంతో.. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు. కంటెంట్ బాగుండి, దానికి దైవత్వం తోడైతే.. ఆ సినిమా పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటుతుంది. దానికి ఉదాహరణగా ఇటీవల విడుదలైన 'హనుమాన్'(Hanuman)ని చెప్పుకోవచ్చు. 'అఖండ' కూడా ఆ తరహా సినిమానే. కానీ అప్పుడు పాన్ ఇండియా మూవీగా విడుదల చేయలేదు. కానీ ఇప్పుడు 'అఖండ-2'ని ముందు నుంచే పాన్ ఇండియా సినిమాగా ప్రమోట్ చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 'కార్తికేయ-2' కూడా అదే తరహాలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే 'అఖండ-2' మాత్రం పాజిటివ్ టాక్ వస్తే 'హనుమాన్' స్థాయిలో ఊహించని సంచలనాలు సృష్టించే అవకాశముంది.
![]() |
![]() |