Home  »  News  »  GDN మూవీ రివ్యూ: ఇండియన్ ఎడిసన్ బయోపిక్ ఎలా ఉందంటే.?

Updated : Aug 8, 2026

ఆర్‌. మాధవన్‌ టైటిల్‌ రోల్‌లో, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తూ తెరకెక్కించిన తాజా బయోపిక్ 'జి.డి.ఎన్‌' (GDN). 'రాకెట్రీ'లో నంబి నారాయణన్‌గా అద్భుత నటనతో అలరించిన మాధవన్‌, ఈసారి జి.డి. నాయుడు అలియాస్ గోపాలస్వామి దొరస్వామి నాయుడు పాత్రలో మన ముందుకు వచ్చారు. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? అనేది తెలుసుకుందాం.

కథ విషయానికి వస్తే.. కోయంబత్తూరులోని ఒక తెలుగు రైతు కుటుంబంలో జన్మించిన జి.డి. నాయుడు చదువు మూడో తరగతితోనే ఆగిపోతుంది. కానీ, "జీవితంలో డిగ్రీల కంటే నేర్చుకోవాలనే తపన, నిరంతర అన్వేషణే ముఖ్యం" అని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన. హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తూ, ఒక బ్రిటీషర్ దగ్గర చూసిన మోటార్ సైకిల్‌ని కొనుగోలు చేసి, దాని పార్ట్స్ అన్నీ విప్పి.. అదెలా పనిచేస్తుందో అధ్యయనం చేస్తాడు. అలా మొదలైన ఆయన ఆవిష్కరణల ప్రయాణం.. భారత్‌లోనే తొలి విద్యుత్ మోటార్ తయారీ వరకు సాగుతుంది.

అంతేకాదు, ఒకే ఒక్క బస్సుతో ప్రారంభించి, ఏకంగా 600 బస్సులతో 'యునైటెడ్ మోటార్ సర్వీస్' అనే రవాణా సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు. భారతదేశంలోనే మొట్టమొదటి పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించి విద్యా రంగంలో విప్లవం తెస్తారు. అయితే, ఆయన ఎదుగుదల చూసి తట్టుకోలేని అప్పటి బ్రిటీషర్లు, కొంతమంది ఈర్ష్యాపరులైన పారిశ్రామికవేత్తలు ఆయనపై అధిక పన్నులు విధించి, దేశద్రోహి అని ముద్ర వేయడానికి కుట్రలు పన్నుతారు. మరి ఆ కుట్రలను జి.డి. నాయుడు తన మేధస్సుతో ఎలా తిప్పికొట్టాడు? అనేది తెరపై చూడాల్సిందే.

ఈ సినిమా ఎలా ఉందంటే..
ఒక అసాధారణమైన వ్యక్తి జీవితాన్ని తెరపైకి తీసుకురావడం ఎప్పుడూ పెద్ద సవాలే. 1920 నుంచి 1960ల వరకు నాలుగు దశాబ్దాల కాలాన్ని దర్శకుడు కృష్ణకుమార్ రామ్‌కుమార్ కళ్లకు కట్టారు. ముఖ్యంగా వ్యాపారంలో నష్టాలు రావడం, మళ్లీ సున్నా నుంచి రవాణా సామ్రాజ్యాన్ని సృష్టించడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

అయితే, ఇండియన్ ఎడిసన్‌గా పేరుగాంచిన జి.డి. నాయుడి గొప్ప గొప్ప ఆవిష్కరణలు, వ్యవసాయంలో ఆయన సృష్టించిన నూతన వంగడాలు వంటి స్ఫూర్తిదాయక అంశాలు  చూపించడం కంటే.. పన్నుల వివాదాలు, పొలిటికల్ కుట్రల చుట్టూనే కథను ఎక్కువ నడిపించడం కాస్త నిరాశపరుస్తుంది. దాంతో ఎమోషనల్ కనెక్షన్ తగ్గినట్లు అనిపిస్తుంది. అలాగే, మొదటి భార్య చెల్లమ్మ (ప్రియమణి) పాత్రను అర్ధాంతరంగా ముగించడం కథలోని గాఢతను తగ్గించింది.

నటీనటుల విషయానికి వస్తే.. మాధవన్‌ మరోసారి జీవించేశారు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ జి.డి. నాయుడు పాత్రకి ప్రాణం పోశాయి. దుషార విజయన్, ప్రియమణి, సత్యరాజ్, జయరామ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో ఉంది. గోవింద్ వసంత అందించిన సంగీతం సన్నివేశాలలోని భావోద్వేగాలను చక్కగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

చివరగా చెప్పాలంటే.. ఒక గొప్ప భారతీయుడి స్ఫూర్తిదాయక జీవిత చరిత్రను తెలుసుకోవడానికి, మాధవన్‌ అద్భుత నటన కోసం 'జి.డి.ఎన్‌' సినిమాను ఒకసారి చూడవచ్చు.

 

 

 

GDN Movie Review, GDN Review Telugu, GD Naidu Biopic, Madhavan

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.