![]() |
![]() |

తారాగణం: అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి, నందు, సత్య, శివాజీ రాజా, ఆమని, కోన వెంకట్ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
డీఓపీ: సుజాత సిద్ధార్థ్
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
రచన: విశ్వజిత్
దర్శకత్వం: అవినాష్ తిరువీధుల
నిర్మాతలు: అవినాష్ బుయాని, ఆలపాటి రాజా, అంకిత్ రెడ్డి
బ్యానర్: సిల్వర్ స్క్రీన్ సినిమాస్
విడుదల తేదీ: జనవరి 1, 2026
నూతన సంవత్సరం కానుకగా నందు హీరోగా నటించిన 'సైక్ సిద్ధార్థ' విడుదలైంది. అయితే ఇదే రోజు నందు విలన్ గా నటించిన 'వనవీర' కూడా విడుదల కావడం విశేషం. అవినాష్ తిరువీధుల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదట 'వానర'గా ప్రచారం పొంది, కొన్ని కారణాల 'వనవీర'గా పేరు మార్చుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..? (VanaVeera Movie Review)
కథ:
వనపురానికి చెందిన మధ్య తరగతి యువకుడు రఘు(అవినాష్).. ఉన్నత చదువులు చదివినా ఊళ్ళో ఖాళీగా ఉంటాడు. అతనికి తన తండ్రి కొనిచ్చిన బైక్ అంటే ఎంతో ఇష్టం. అయితే ఓసారి దేవా(నందు) పొలిటికల్ ర్యాలీ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అతని మనుషులకు బైక్ ఇవ్వాల్సి వస్తుంది రఘు. కానీ ఆ బైక్ వాళ్ళు తిరిగి ఇవ్వరు. తన బైక్ ని తిరిగి తెచ్చుకోవడం కోసం రఘు ఏం చేశాడు? దేవా పార్టీలో అతను ఎందుకు చేరాడు? తర్వాత దేవాకు పోటీగా తానే ఎమ్మెల్యే అభ్యర్థిని బరిలోకి ఎందుకు దింపాల్సి వచ్చింది? అసలు రఘు ఇదంతా బైక్ కోసమే చేస్తున్నాడా? మరేదైనా లక్ష్యం ఉందా? ఈ కథకి, రామాయణానికి సంబంధం ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
కమర్షియల్ కథలను కూడా పురాణాలతో ముడిపెట్టి సినిమాలు చేయడం ఈమధ్య ట్రెండ్ గా మారింది. 'వనవీర' కూడా ఆ కోవలోకే వస్తుంది. కుల వివక్ష నేపథ్యంలో రూరల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ ఇది. దీనికి రామాయణంలోని వానరసేన కథను ముడిపెట్టాడు దర్శకుడు. అదే ఈ సినిమాకి కొత్తదనాన్ని తీసుకొచ్చింది.
ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెనుక హనుమంతుడు ఉంటాడు అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పడానికి ప్రయత్నించారు. మరి హీరో చేసిన ధర్మ యుద్ధం దేని కోసం? అతనిని హనుమంతుడు ఎలా నడిపించాడు? వంటి అంశాలతో సినిమా నడుస్తుంది.
వానరసేనకు హనుమంతుడు ఇచ్చే మాటతో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమైంది కానీ.. ఫస్ట్ హాఫ్ అంతా అదే ఆసక్తి కొనసాగలేదు. కుల రాజకీయాలు, హీరో పాత్ర పరిచయం, అతని బైక్ ని దేవా మనుషులు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం, బైక్ ని తెచ్చుకోవడం కోసం హీరో రాజకీయ పార్టీలో చేరి పనివాడిలా సేవలు చేయడం.. వంటి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా నడిచింది.
అసలు కథ సెకండాఫ్ లోనే ఉంటుంది. దేవాతో హీరోకి ఉన్న విరోధం ఏంటి? అతన్ని దెబ్బ కొట్టడానికి హీరో ఏం చేశాడు? అనేది సెకండాఫ్ లో చూపించారు. ఈ క్రమంలో వచ్చే మలుపులు మెప్పించాయి. అయితే దేవాని దెబ్బ కొట్టడానికి హీరో చేసే ప్రయత్నాలను ఇంకా బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. పతాక సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో సత్య క్యామియో నవ్వులు పూయిస్తుంది.
కథనం నెమ్మదిగా సాగడం ఈ సినిమాని ప్రధాన సమస్య. అలాగే చాలా సీన్స్ లో కొత్తదనం లోపించింది. ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు.
హీరోగా, డైరెక్టర్ గా అవినాష్ తన ప్రతిభను కనబరిచాడు. విలన్ గా నందు మెప్పించాడు. సిమ్రాన్ చౌదరి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. శివాజీ రాజా, సత్య నిడివితో సంబంధం లేకుండా తమ మార్క్ చూపించారు.
చిన్న సినిమా అయినా సాంకేతికంగా బాగానే ఉంది. ఏఐని ఉపయోహించుకొని వానరసేన విజువల్స్ బాగా చూపించారు. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ అయింది. పాటలు తేలిపోయాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాత విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్ గా..
తెలిసిన కథే అయినా.. రామాయణ గాథతో ముడిపెడుతూ కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా నడిచినప్పటికీ.. సెకండ్ హాఫ్ లోని మలుపులు, కొన్ని నవ్వులు సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాయి.
Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.
![]() |
![]() |