![]() |
![]() |

ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'రంగమార్తాండ'. మరాఠీ మూవీ 'నటసామ్రాట్'కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కొన్నేళ్లుగా సరైన హిట్ లేని కృష్ణవంశీ.. 'రంగమార్తాండ'తో మళ్ళీ తానేంటో చూపించాలి అనుకుంటున్నారు. అందుకేనేమో వాయిస్ ఓవర్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపారు.
'రంగమార్తాండ' సినిమా కోసం చిరంజీవి తన గొంతు అరువిచ్చారు. ఇందులోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కృష్ణవంశీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'రంగమార్తాండ' వినీలాకాశంలో మరో వెలుగు దివ్వె మెగా వాయిస్ అని అభివర్ణించారు. వాయిస్ ఓవర్ చెప్పినందుకు థాంక్యూ అన్నయ్యా అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
'రంగమార్తాండ'కు చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పడం పట్ల రచయిత లక్ష్మి భూపాల సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "ఈ సినిమా థీమ్ కోసం నేను రాసిన వచన కవిత్వం మెగాస్టార్ చిరంజీవి గారి నోట పలికింది. ఎంతో శ్రద్ధగా పదం పదం చదివి అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, ఆవాహన చేసుకుని మెగాస్టార్ పలికిన తీరు అత్యద్భుతం. ఒక నటుడి జీవితాన్ని ఆవిష్కరించే 'రంగమార్తాండ' సినిమాలో, మెగాస్టార్ లాంటి గొప్ప నటుడి గొంతు నా పదాలు పలకడం చాలా చాలా సంతోషంగా ఉంది." అన్నారు.
'రంగమార్తాండ' సినిమాలో ప్రకాష్ రాజ్ తో పాటు రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
![]() |
![]() |