![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్‌ను పరిశీలిస్తే ఓ విషయం స్పష్టం. అదేమిటంటే.. కథానాయకుడిగా తొలి అడుగు వేసినప్పటినుంచి మహేశ్ తన కెరీర్లో సింహభాగం ఉత్తరాది భామలతోనే ఆడిపాడాడు. మరీ ముఖ్యంగా.. ‘రాజకుమారుడు’ నుండి ‘ఒక్కడు’ వరకు అంటే.. మహేశ్ తొలి ఏడు చిత్రాలు నార్త్ ఇండియన్ బ్యూటీస్ కాంబినేషన్లోనే తెరకెక్కాయి. ఎనిమిదో చిత్రం ‘నిజం’ నుండి మాత్రం కాస్త రూట్ మార్చాడు ఈ ఘట్టమనేని హ్యాండ్సమ్ హీరో. ఆ సినిమా మొదలు అడపాదడపా దక్షిణాది ముద్దుగుమ్మలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశాడీ ‘పోకిరి’ స్టార్. రక్షిత, త్రిష, అనుష్క, సమంత, ప్రణీత, శ్రుతి హాసన్, పూజా హెగ్డే, రష్మికా మందన్న.. ఇలా చెప్పుకోదగ్గ స్థాయిలోనే సదరన్ బ్యూటీస్‌తో జట్టుకట్టాడు మహేశ్. ఈ పరంపరలోనే మరో సౌత్ ఇండియన్ బ్యూటీతో కలిసి తన నెక్స్ట్ సినిమాలో నటించబోతున్నాడు. ఆ నాయిక మరెవరో కాదు.. కేరళ కుట్టి కీర్తి సురేశ్.
‘గీత గోవిందం’ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో ‘సర్కారు వారి పాట’ పేరుతో మహేశ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులోనే హీరోయిన్గా కీర్తి సురేశ్ దర్శనమివ్వనుంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దక్షిణాది భామలతో మహేశ్ తొలిసారి నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం ఘనవిజయం సాధించాయి. చెన్నై పొన్ను త్రిషతో ఫస్ట్ టైమ్ జోడికట్టిన ‘అతడు’ మహేశ్ కెరీర్లోనే మెమరబుల్ ఫిలిమ్‌గా నిలవగా.. మరో తమిళ తరుణి సమంతతో తొలిసారి జంటగా నటించిన ‘దూకుడు’ అప్పట్లో మహేశ్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అలాగే, మరో చెన్నై బ్యూటీ శ్రుతి హాసన్‌తో మొదటిసారి ఆడిపాడిన ‘శ్రీమంతుడు’ కూడా మహేశ్ కెరీర్లో ఓ సంచలన విజయంగా నమోదయింది. ఆ టైమ్‌లో హయ్యెస్ట్ గ్రాసర్గానూ నిలిచింది. అలాగే, ఉత్తరాదిలో పుట్టి పెరిగిన మంగళూరు మూలాలు ఉన్న బ్యూటీ పూజా హెగ్డేతో మహేశ్ జట్టుకట్టిన ‘మహర్షి’, కన్నడ కస్తూరి రష్మికతో ఫస్ట్ టైమ్ కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా మహేశ్ కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ హయ్యెస్ట్ గ్రాసర్స్‌గా నిలిచాయి. సో.. సౌత్ ఇండియన్ బ్యూటీస్‌తో మహేశ్ ఫస్ట్ టైమ్ రొమాన్స్ చేసిన సినిమాల్లో సింహభాగం అతని కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్స్‌గా నిలిచాయన్న మాట.
మరి.. ఈ సెంటిమెంట్ కీర్తి సురేశ్ విషయంలోనూ కొనసాగి ‘సర్కారు వారి పాట’ కూడా మహేశ్ కెరీర్లో మరో హయ్యెస్ట్ గ్రాసర్‌గా, మెమరబుల్ ఫిలిమ్‌గా నిలుస్తుందేమో చూడాలి.
![]() |
![]() |