![]() |
![]() |

కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య తారగా వారి హృదయాలపై చెరగని ముద్ర వేసిన దివంగత నటి సౌందర్య బయోపిక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే సౌందర్య కుటుంబంతో ఓ పేరుపొందిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ సంప్రదింపులు జరిపారని ప్రచారంలోకి వచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావచ్చు.
ప్రస్తుతం ఈ బయెపిక్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సమీప భవిష్యత్తులోనే షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. అయితే సౌందర్య పాత్రకు న్యాయం చెయ్యగల నటి కోసం దర్శక నిర్మాతలు అన్వేషిస్తున్నారు. అభినవ సావిత్రిగా పేరు సంపాదించుకున్న సౌందర్య లాంటి ప్రతిభావంతురాలైన నటి పాత్రకు సాయిపల్లవి అయితే న్యాయం చేకూరుస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. నిజానికి కీర్తి సురేశ్ పేరు కూడా పరిగణనలోకి వచ్చినా, ఇప్పటికే ఆమె మహానటి సావిత్రి బయోపిక్ చేసినందువల్ల చివరకు ఆమె పేరును పక్కన పెట్టారంటున్నారు. ఏదేమైనా త్వరలోనే ఈ చిత్రానికి పనిచేసే తారాగణం, సాంకేతిక బృందం వివరాలను నిర్మాతలు ప్రకటించనున్నారని ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది.
దక్షిణాదిలో తన కాలంలోని టాప్ హీరోలందరితోనూ జంటగా నటించిన సౌందర్యకు 'అమ్మోరు' చిత్రం మంచి పేరు తెచ్చింది. దాని తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలుగలేదు. అయితే 2004 ఏప్రిల్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తన సోదరునితో సహా మృతిచెందిన ఆమె అశేష అభిమానులను విషాదంలో ముంచేశారు.
![]() |
![]() |