![]() |
![]() |

ఇళయ దళపతి విజయ్(Vijay)ఆఖరి చిత్రం 'జననాయగన్'(Jana Nayagan)రిలీజ్ చుట్టూ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక సరికొత్త హాట్ టాపిక్ నడుస్తోంది. గత 7 నెలలుగా ఈ చిత్రం అనేక సెన్సార్ వివాదాలు, న్యాయపోరాటాలు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ మూవీ విడుదలకి సంబంధించిన కీలకమైన అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి 'A' (అడల్ట్) సర్టిఫికెట్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 7 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చే వారం రోజుల్లోగా ఈ తుది సెన్సార్ ప్రక్రియ పూర్తవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. తమిళ వెర్షన్ ప్రక్రియ పూర్తి కాగానే, హిందీతో పాటు తెలుగు వెర్షన్ల సెన్సార్ ఫార్మాలిటీస్‌ను కూడా అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తోంది. ఎట్టకేలకు సెన్సార్ సమస్యలు వీడుతుండటంతో, ఈ హై వోల్టేజ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని జూలై 16 లేదా జూలై 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే, ఈ విండోలో ఇప్పటికే పలు క్రేజీ తమిళ చిత్రాలు తమ విడుదల తేదీలను ప్రకటించుకుని ప్రమోషన్లలో బిజీగా ఉన్నాయి. జూలై 17న 'అన్బే డయానా', జూలై 23న 'మకుటం', 'ఇమ్మోర్టల్' వంటి సినిమాలు, అలాగే జూలై 31న 'డిసి', 'సిగ్మా' వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ విజయ్ 'జననాయగన్' సినిమాతో బాక్సాఫీస్ రేసులోకి వస్తే, ఇప్పటికే ప్రమోషన్లు మొదలుపెట్టిన ఆయా చిత్రాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు, ఈ సినిమాకు ఒకవేళ 'A' సర్టిఫికెట్ ఇస్తే చిన్న పిల్లలు ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు అనుమతించరు. దీనివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవుతారని, తమ ప్రియతమ హీరో చివరి సినిమాకు కావాలనే ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ విజయ్ అభిమానులు మరియు తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామాకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు.
![]() |
![]() |