![]() |
![]() |

దర్శకుడు మెహర్ రమేష్ (Meher Ramesh) ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమార్తె మోహన వివాహ వేడుక హైదరాబాద్ లోని ఒక అత్యంత ప్రముఖ కన్వెన్షన్ హాల్‌లో అట్టహాసంగా జరిగింది. తోట చంద్రశేఖర్ కుమారుడైన అనిరుధ్‌తో మోహన కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఇటీవలవీరి నిశ్చితార్థ వేడుకను చాలా రిచ్‌గా నిర్వహించగా, తాజాగా జరిగిన పెళ్లి వేడుక అంతకు మించి అనేలా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ వివాహ మహోత్సవానికి సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ఆయన సతీమణి సురేఖ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు విక్టరీ వెంకటేష్, సీనియర్ నటుడు మురళీమోహన్, స్టార్ యాంకర్ సుమ కనకాల ఈ వేడుకలో సందడి చేశారు.
టాలీవుడ్ ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, శ్రీను వైట్ల, వీర శంకర్, అలాగే అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, ఏఎం రత్నం, సి. అశ్వినీదత్, ప్రముఖ రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి తదితరులు హాజరై పెళ్లి సందడిని రెట్టింపు చేశారు.
కేవలం సినిమా వాళ్లే కాకుండా రాజకీయ రంగం నుండి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అంబటి రాంబాబు వంటి ప్రముఖ నేతలు కూడా విచ్చేసి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
మెహర్ రమేష్‌కు మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం ఈ వేడుకలో మరోసారి స్పష్టంగా కనిపించింది. చిరంజీవి తండ్రి, మెహర్ రమేష్ అమ్మమ్మ సొంత అక్కాతమ్ముళ్లు కావడంతో మెహర్ రమేష్ చిన్నప్పటి నుంచే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులతో ఎంతో క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. మెగా కాంపౌండ్‌లో జరిగే ప్రతి చిన్న వేడుకలోనూ మెహర్ రమేష్ ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తుంటారు. అందుకే తన కుమార్తె పెళ్లికి మెగాస్టార్ ప్రత్యేకంగా వచ్చి ఆశీస్సులు అందించారు.
పూరీ జగన్నాథ్ వద్ద డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో కెరీర్ ప్రారంభించిన మెహర్ రమేష్.. కన్నడలో 'వీరకన్నడిగ', 'అజయ్' వంటి చిత్రాల తర్వాత తెలుగులో ఎన్టీఆర్‌తో 'కంత్రి', ప్రభాస్‌తో 'బిల్లా', వెంకటేష్‌తో 'షాడో', చిరంజీవితో 'భోళా శంకర్' వంటి చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం మోహన, అనిరుధ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
![]() |
![]() |