![]() |
![]() |
అర్జున్‌రెడ్డి, గీతగోవిందం వంటి బ్లాక్‌బస్టర్స్‌తో ఒక్కసారిగా పీక్స్‌కి వెళ్లిపోయిన విజయ్ దేవరకొండ కెరీర్ ఆ తర్వాత వచ్చిన సినిమాలతో గాడి తప్పింది. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన టాక్సీవాలా అతనికి చివరి హిట్‌గా చెప్పుకోవచ్చు. 2018లో వచ్చిన ఈ సినిమా తర్వాత దాదాపు అతను నటించిన పది సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 5 సినిమాల్లో మాత్రమే అతను హీరోగా నటించాడు. మిగతా ఐదు సినిమాల్లో కేమియో రోల్స్ చేశాడు. హీరోగా నటించిన 5 సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. దీంతో అతని కెరీర్ అయోమయంలో పడిరది.
మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చేందుకు విజయ్ దేవరకొండ చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కథల ఎంపికలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కాన్సెప్ట్ పరంగా కొత్త ప్రయోగాలు చేసినా తన పూర్వ వైభవం తెచ్చుకోలేకపోయాడు. పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో చేసిన ‘లైగర్’పై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. ఎంతో భారీగా నిర్మాణం జరుపుకొని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌ని రంగంలోకి దించారు. అది కూడా అతనికి కలిసి రాలేదు.
‘లైగర్’ తర్వాత విజయ్ దేవరకొండ చేసిన ఖుషి, ది ఫ్యామిలీ స్టార్, కింగ్‌డమ్ చిత్రాలు కూడా అతనికి ఆశించిన స్థాయి విజయాల్ని అందించలేకపోయాయి. దాంతో తర్వాత చేసే సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ‘టాక్సీవాలా’తో తనకు చివరి హిట్‌ని అందించిన రాహుల్ సంకృత్యాన్‌తో మరో భారీ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ నుంచి ఒక స్టార్ విలన్‌ని రంగంలోకి దింపుతున్నాడు రాహుల్. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 1999లో అడ్వంచరస్ థ్రిల్లర్‌గా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మమ్మి’ చిత్రంలో విలన్‌గా నటించి అందర్నీ ఆకట్టుకున్న అర్నాల్డ్ వోస్లూ టాలీవుడ్‌కి రాబోతున్నాడు.
‘మమ్మి’ తర్వాత ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో కనిపించిన అర్నాల్డ్.. తొలిసారి ఒక తెలుగు సినిమాలో నటించడం అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, అర్నాల్డ్ నటిస్తున్న తొలి ఇండియన్ మూవీ కూడా ఇదే కావడం విశేషం. విజయ్ దేవరకొండకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక సూపర్‌హిట్ ఇవ్వాలన్న ధ్యేయంతో రాహుల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. 2021లో నాని హీరోగా రాహుల్ తెరకెక్కించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రాహుల్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
![]() |
![]() |