![]() |
![]() |
ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియా విపరీతం విస్తరించిన విషయం తెలిసిందే. ప్రముఖులు ఏ చిన్న మాట మాట్లాడినా అది క్షణాల్లో వైరల్‌గా మారిపోతోంది. అందులో కొన్ని పాజిటివ్‌గా ఉంటే.. మరికొన్ని నెగెటివ్‌గా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో కొందరు కావాలని ఏదో ఒక మాట జారుతూ వార్తల్లో నిలవాలని చూస్తుంటారు. అలాంటి ఓ మాట ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులోనూ ఒక స్టార్ హీరో ఈ మాట అనడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు, అతను వదిలిన ఆ మాట ఏమిటి అనేది తెలుసుకుందాం.
‘ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే. మనిషి 60 ఏళ్లు బ్రతకడం అనేది చాలా అరుదుగా జరుగుతోంది. ఎందుకంటే మన జీవన విధానం అలా మారిపోయింది. ఆమధ్య కరోనా వల్ల ఎంతో మంది చనిపోయారు. కరోనాను జయించినప్పటికీ ఆ తర్వాత కొంతమంది ఎందుకు చనిపోతున్నారో, ఎలా చనిపోతున్నారో కూడా అర్థం కాకుండా ఉంది. వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా గుండెపోటు వస్తోంది. దాంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అలా కాకుండా ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చెయ్యాలి అనే దానికి నా దగ్గర సమాధానం ఉంది.
ఇప్పుడు నా వయసు 69 సంవత్సరాలు. మనిషి 150 ఏళ్ళు ఎలా బ్రతకాలో నాకు తెలుసు. నేను 150 ఏళ్లు ఖచ్చితంగా బ్రతుకుతాను. ఆ సీక్రెట్ మీకు చెప్పాలంటే మీరు ఓ పనిచెయ్యాలి. నన్ను మీరు సీఎంని చెయ్యాలి. 2026లో నన్ను సీఎంని చేస్తే ఆ సీక్రెట్ రివీల్ చేస్తాను’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఆ హీరో. ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. శరత్‌కుమార్. గతంలో హీరోగా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ఆయన పెట్టిన ఈ పోస్ట్ నెటిజన్ల పాలిట పెద్ద కామెడీ పాయింట్‌గా మారింది. శరత్‌కుమార్‌ను టార్గెట్ చేస్తూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
‘నిన్ను సీఎంని చెయ్యాల్సిన అవసరం మాకేంటి?’ అని కొందరంటుంటే.. ‘ఇలా బ్రతుకుతూ అందరికీ తలనొప్పి తెచ్చే కంటే పోవడమే బెటర్ కదా’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ‘145 సంవత్సరాలు బ్రతికి చూపించు.. అప్పుడు నిన్ను సీఎం చెయ్యాలా? వద్దా? అనేది ఆలోచిస్తాం’ అంటున్నారు. అయితే ఇది శరత్‌కుమార్ తాజాగా పెట్టిన పోస్ట్ కాదనీ, పాత పోస్ట్‌ని ఇప్పుడు మళ్లీ వైరల్ చేస్తున్నారని అర్థమవుతోంది. ఏది ఏమైనా ఇలాంటి సాధ్యం కాని విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకొని వారి ఆగ్రహానికి గురి కావడం అంత అవసరమా అని అతని అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు.
![]() |
![]() |