![]() |
![]() |
మహేష్‌బాబు కెరీర్‌లోనే ‘గుంటూరు కారం’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే అతని కెరీర్‌లో ఏ సినిమాకీ లేనన్ని అప్ అండ్ డౌన్స్ ఈ సినిమా విషయంలో జరిగాయి. సినిమా ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ‘గుంటూరు కారం’ చిత్రానికి వచ్చినన్ని అప్‌డేట్స్ ఏ సినిమాకీ రాలేదంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా ప్రారంభమైన తర్వాత యూనిట్ సభ్యులు ఒక్కొక్కరుగా బయటికి వచ్తేస్తూ ఉండడంతో ‘గుంటూరు కారం’ వార్తల్లోకి ఎక్కింది. తాజాగా సినిమాలోని మూడో పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ మూడో పాట వెనక కూడా ఒక కథ ఉంది.
అదేమిటంటే..ఈ పాట షూటింగ్ సమయంలోనే మహేష్‌కి, త్రివిక్రమ్‌కి మధ్య విభేదాలు వచ్చాయని, దాంతో మహేష్ అలిగి షూటింగ్ నుంచి వెళ్లిపోయాడని వార్తలు వచ్చాయి. ఈ పాట కోసం వేసిన సెట్‌ను కూడా తొలగిస్తున్నారని చెప్పుకున్నారు. ఒకదశలో ఈ పాట లేకుండానే సినిమాను విడుదల చేయాలని నిర్మాత భావించారట. ఆ తర్వాత ఏమైందో తెలీదు. అదే సెట్‌లో మహేష్, శ్రీలీలపై మూడో పాటను చిత్రీకరించారు. ఈ పాటకి సంబంధించిన విజువల్స్ కూడా లీక్ అయి మేకర్స్‌ని కలవరపెట్టాయి. త్రివిక్రమ్, థమన్ కాంబినేషన్‌లో మ్యూజికల్ హిట్స్ చాలా వచ్చాయి. అయితే ‘గుంటూరు కారం’ చిత్రం విషయంలో థమన్ కాన్‌సన్‌ట్రేషన్ తగ్గిందని, మంచి పాటలు ఇవ్వడం లేదని ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ అతనిపై ఫైర్ అవుతున్నారు. అయితే ఈ మూడో పాట వారిని కాస్త శాంత పరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. అసలు ఈ పాట గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విట్టర్‌లో ఏమని పోస్ట్ చేశారంటే..
‘స్పైసీ మాస్ నంబర్ విజువల్స్ ఇప్పుడే చూశాను! మంట పుట్టించారు. సూపర్ స్టార్ మహేష్‌బాబుగారు, శ్రీలీల ఇద్దరూ చితక్కొట్టేశారు అంతే. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా వెండితెరలను మండిస్తుంది. మన మాస్ భాషలో చెప్పాలి అంటే.. ఆ కుర్చీని మడతపెట్టి..’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ పాట ప్రోమోను డిసెంబర్ 29న విడుదల చేసి, పాటను డిసెంబర్ 30న విడుదల చేస్తారని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ‘గుంటూరు కారం’ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడో పాట గురించి నిర్మాత నాగవంశీ చేసిన పోస్ట్ కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
![]() |
![]() |