![]() |
![]() |

రవితేజ హీరోగా నటించిన 'క్రాక్' మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్టయ్యింది. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన డబ్బులో ప్రతి రూపాయికీ రూపాయి లాభం తీసుకొచ్చింది. అంటే 100 శాతం ప్రాఫిట్ తెచ్చిందన్న మాట. 17.5 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోతే దాదాపు 37 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. 50 శాతం ఆక్యుపెన్సీలోనే ఈ రేంజ్ లాభాలు తేవడం స్మాల్ థింగ్ కాదు. అయితే ఈ సినిమా విడుదల టైమ్ నుంచే కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఫస్ట్.. ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు మునుపటి సినిమాల తాలూకు అప్పులు ఈ సినిమాపై పడి, టైమ్‌కు రిలీజ్‌కు కాలేదు. జనవరి 9న మార్నింగ్ షోతో రిలీజ్ కావాల్సిన మూవీ ఎట్టకేలకు సెకండ్ షోతో స్టార్టయింది.
తర్వాత నైజాంలో థియేటర్ల విషయంలో కాంట్రవర్సీ ఎదురయ్యింది. దిల్ రాజు నైజాంలో 'క్రాక్' బాగా ఆడుతున్న పలు థియేటర్లను ఇతర సినిమాలకు ఇచ్చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనివాస్ మీడియాకు ఎక్కారు. ప్రొడ్యూసర్ మధు ఈ విషయాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు కంప్లయింట్ చేశాడు. కౌన్సిల్ జోక్యం చేసుకొని, క్రాక్‌కు సెకండ్ వీక్ నుంచి మరిన్ని థియేటర్లు ఇప్పించింది.
ఇప్పుడు లేటెస్ట్‌గా ప్రొడ్యూసర్ మధుపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్టర్స్ అసోసియేషన్‌కు కంప్లయింట్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. తనకు అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన పూర్తి రెమ్యూనరేషన్ ఇవ్వలేదనీ, బ్యాలెన్స్ అమౌంట్‌ను ఇప్పించాలనీ ఆయన అసోసియేషన్‌ను కోరాడు. ఫిబ్రవరి 4న డైరెక్టర్స్ అసోసియేషన్ ఈ లెటర్‌ను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు పంపింది. దీనికి డైరెక్టర్ అగ్రిమెంట్, రైటర్ అగ్రిమెంట్‌ను కూడా జత చేసింది. ఇప్పుడు దీనిపై ఎంక్వైరీ చేసి, తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌పై పడింది. క్రాక్ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తీసి, అందరికీ లాభాలు అందించిన గోపీచంద్‌కు తన రెమ్యూనరేషన్ విషయంలో న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడడం గమనార్హం. ఠాగూర్ మధు ఏం చేస్తాడో చూడాలి.

![]() |
![]() |