సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమా చూశారుగా! అందులో హీరో ఏం చేస్తాడో గుర్తుందా? గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు. అక్కడ పాఠశాల కట్టిస్తాడు. రోడ్లు వేయిస్తాడు. ఇంకా చాలా చాలా మంచి పనులు చేస్తాడు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సుకుమార్ చేస్తున్న పని తెలిస్తే... నిస్సందేహంగా అతడు శ్రీమంతుడే అని ప్రేక్షకులు అంటారు.
తూర్పు గోదావరి జిల్లాలోని మట్టపర్రు సుకుమార్ సొంతఊరు. తన తండ్రి బండ్రెడ్డి తిరుపతి రావు నాయుడు గారి పేరు మీద సొంతూరిలో మండల ప్రజా పరిషత్ ప్రాధమిక ఉన్నత పాఠశాల ఆవరణలో సుకుమార్ రెండు అంతస్తుల పాఠశాల భవనం కట్టించనున్నారు. సుమారు 14 లక్షల రూపాయల నిర్మాణ వ్యయంతో కూల్ బిల్డింగ్ కట్టిస్తున్నారు. 'శ్రీమంతుడు'లో మహేష్ బాబులా సొంతూరులో పాఠశాల కట్టిస్తున్న సుకుమార్ శ్రీమంతుడే కదా మరి.
తండ్రి అంటే విపరీతమైన ప్రేమాభిమానులు ప్రదర్శించే సుక్కు, 'నాన్నకు ప్రేమతో' అనే సినిమా రూపొందించారు. ఇప్పుడు నాన్నకు ప్రేమతో స్కూలు కట్టిస్తున్నారు.