Home  »  News  »  Dil Raju: ఇక మీ ఆటలు సాగవు బాసు.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

Updated : Jun 27, 2026

 


అగ్ర నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న దిల్ రాజు ఇటీవల డిజిటల్ రైట్స్ (ఓటీటీ హక్కులు) మార్కెట్‌పై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండానే స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీల్లో ఓటీటీ వేదికల ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. భాషా భేదం లేకుండా ప్రపంచవ్యాప్త కంటెంట్‌ని మన చేతి వేళ్లపైకి తెస్తూ, నేటి తరం లైఫ్‌స్టైల్‌లో ఓటీటీ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. అయితే, ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వల్ల మొదట్లో లాభపడిన నిర్మాతలకు ఇప్పుడు సరికొత్త కష్టాలు మొదలయ్యాయని దిల్ రాజు స్పష్టం చేశారు. ఒకప్పుడు సినిమాలకు బంగారు బాతులా కనిపించిన డిజిటల్ మార్కెట్, ఇప్పుడు రివర్స్ గేర్ వేసిందని ఆయన విశ్లేషించారు.

మొదట్లో భారతదేశంలో తమ సబ్‌స్క్రైబర్ల సంఖ్యని వేగంగా పెంచుకోవాలనే ఏకైక లక్ష్యంతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి అంతర్జాతీయ కార్పొరేట్ ఓటీటీ సంస్థలు కోట్లాది రూపాయలు గుమ్మరించాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా దొరికిన ప్రతి సినిమాని భారీ రేట్లకు కొనేశాయి. కానీ, సీన్ కట్ చేస్తే తాము పెట్టిన భారీ పెట్టుబడులకి, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఆయా సినిమాలకి  వచ్చిన వ్యూస్‌కు అసలు  పొంతన లేదని ఆ సంస్థలు ఆలస్యంగా గ్రహించాయి. పెట్టిన ఖర్చులో సగం కూడా తిరిగి రాకపోవడంతో ఓటీటీ దిగ్గజాలు తీవ్ర నష్టాలని  చవిచూశాయి. దీంతో ఆ  కార్పొరేట్ సంస్థలన్నీ ఇప్పుడు పూర్తిగా యూ టర్న్ తీసుకున్నాయి. కేవలం సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరిగితే సరిపోదని, కంటెంట్ ద్వారా ఆదాయం రావడం ముఖ్యమని సరికొత్త వ్యూహాలని  అమలు చేస్తున్నాయి.

ఈ మార్పుల కారణంగా ప్రస్తుతం ఓటీటీ అగ్రిమెంట్లు, బిజినెస్ డీల్స్ ఏకంగా 50 శాతం వరకు పడిపోయాయి. గతంలో సినిమా కథ వినగానే లేదా షూటింగ్ దశలోనే కోట్లకు కోట్లు ఆఫర్ చేసిన సంస్థలు, ఇప్పుడు కొత్త కండిషన్లు పెడుతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూశాకే డిజిటల్ బిజినెస్ క్లోజ్ చేస్తామని తెగేసి చెప్తున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల ఇప్పుడు చాలా మంది నిర్మాతలు థియేటర్ రిలీజ్ కంటే ముందే ఓటీటీ పార్ట్‌నర్స్‌కి  తమ సినిమాని ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేసి చూపిస్తున్నారు. వారిని కంటెంట్‌తో ఒప్పించి, పూర్తి ఒప్పందం కుదుర్చుకున్నాకే అధికారికంగా థియేటర్ రిలీజ్ డేట్‌  అనౌన్స్ చేస్తున్నారు.

Also read: హార్దిక్ పాండ్యాని వివాహం చేసుకున్న ప్రముఖ హీరోయిన్!.. పిక్స్ వైరల్ 


ఒకవేళ అలా ముందస్తు ఒప్పందం చేసుకోకుండా, నేరుగా థియేటర్లలోకి వచ్చి సినిమా గనుక ఫ్లాప్ అయితే, ఇక ఓటీటీ సంస్థలు రూపాయి కూడా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. థియేటర్లలో ఆడని సినిమాని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కూడా ఎవరూ చూడరనేది ఓటీటీల నయా పాలసీ. బాక్స్ ఆఫీస్ హిట్ సాధిస్తేనే డిజిటల్ డీల్, లేదంటే నో డీల్ అనే క్లియర్ కట్ రూల్ నడుస్తోంది. ఈ పరిణామాలు టాలీవుడ్‌తో పాటు మిగతా సినీ పరిశ్రమలలోని నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం డిజిటల్ రైట్స్ నమ్ముకుని సినిమాలు తీసే రోజులు పోయాయని, కంటెంట్ బలంగా ఉండి థియేటర్లలో హిట్ కొడితేనే మనుగడ సాధ్యమని దిల్ రాజు హెచ్చరించారు.


   






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.