![]() |
![]() |

విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలిచిన నిర్మాతల్లో `దిల్` రాజు ఒకరు. ఇటు యువ కథానాయకులతోనూ, అటు అగ్ర కథానాయకులతోనూ రాజు నిర్మించిన పలు సినిమాలు.. టాలీవుడ్ లో సంచలనం సృష్టించాయి. అలాంటి రాజుకి ఏప్రిల్ 5 ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే.. 19 ఏళ్ళ క్రితం అంటే 2003లో ఇదే రోజున రాజు నిర్మించిన తొలి చిత్రం `దిల్` విడుదలై ఘనవిజయం సాధించింది. చిత్ర పరిశ్రమలో తనని `దిల్` రాజుగా నిలిపింది. మరో నిర్మాత గిరితో కలిసి `దిల్`ని నిర్మించారు రాజు.
`జయం` వంటి సంచలన చిత్రం తరువాత నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాని అగ్ర దర్శకుడు వీవీ వినాయక్ రూపొందించగా.. నేహ ఈ చిత్రంతో కథానాయికగా తొలి అడుగేసింది. ప్రకాశ్ రాజ్, రాజన్ పి. దేవ్, చలపతిరావు, సుధ, కల్పన, సంగీత, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, వేణు మాధవ్, రఘుబాబు, రఘు కారుమంచి, రాళ్ళపల్లి, ఆహుతి ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ఒడియాలో `ప్రేమి నెంబర్ వన్`, కన్నడలో `స్టూడెంట్`, తమిళంలో `కుత్తు`, బెంగాలీలో `ఛాలెంజ్`, బంగ్లాదేశీ బెంగాలీలో `భాలోభాషా జిందాబాద్` టైటిల్స్ తో ఈ చిత్రం రీమేక్ అయింది. 2003 ఏప్రిల్ 5న విడుదలై ఘనవిజయం సాధించిన `దిల్`.. నేటితో 19 వసంతాలు పూర్తిచేసుకుంది. అంటే.. `దిల్` రాజు నిర్మాణ ప్రస్థానానికి 19 ఏళ్ళు పూర్తయ్యాయన్నమాట.
![]() |
![]() |