![]() |
![]() |

తెలుగువారిని విశేషంగా అలరించిన వెండితెర జంటల్లో యువ సామ్రాట్ నాగచైతన్య, స్టార్ బ్యూటీ సమంత జోడీ ఒకటి. `ఏమాయ చేసావె` (2010), `మనం` (2014) వంటి చిత్రాలతో మెమరబుల్ హిట్స్ అందుకున్న ఈ సక్సెస్ ఫుల్ పెయిర్.. నిజజీవితంలో దంపతులయ్యాక తొలిసారిగా కలిసి నటించిన సినిమా `మజిలీ`. అలాగే, విడాకులకు ముందు జోడీగా నటించిన ఆఖరి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామాలో.. ఒకరికి మనసిచ్చి అనూహ్య పరిస్థితుల్లో మరొకరిని మనువాడే పూర్ణ చంద్ర రావు అనే యువకుడిగా చైతూ కనిపించగా, తను మూగగా ఆరాధించిన వ్యక్తినే పెళ్ళాడి అతని క్షేమం కోసం ఏమైనా త్యాగం చేసే యువతి శ్రావణి పాత్రలో సామ్ దర్శనమిచ్చింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, సన్నివేశాలే `మజిలీ`కి ఆయువుపట్టుగా నిలిచాయి. నూతన కథానాయిక దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రావు రమేశ్, పోసాని కృష్ణ మురళి, అతుల్ కులకర్ణి, సుబ్బరాజు, రవి ప్రకాశ్, సుహాస్, అనన్యా అగర్వాల్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ బాణీలు, తమన్ నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి. పాటల్లో ``ప్రియతమా`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``నా గుండెల్లో``, ``ఏ మనిషికి ఏ మజిలీయో``, ``మాయ్యా మాయ్యా``, ``వన్ బాయ్ వన్ గాళ్``, ``ఏడెత్తు మల్లెలే`` గీతాలు కూడా రంజింపజేశాయి. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన `మజిలీ`.. 2019 ఏప్రిల్ 5న విడుదలై ఘనవిజయం సాధించింది. నేటితో ఈ బ్లాక్ బస్టర్ మూవీ మూడేళ్ళు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |