![]() |
![]() |

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి వహీదా రెహమాన్ ను భారత అత్యున్నత సినీ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. భారత సినీ రంగానికి ఆమె అందించిన సేవలకుగానూ మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డుని ప్రకటించింది.
వహీదా రెహమాన్ సినీ ప్రయాణం తెలుగులోనే మొదలు కావడం విశేషం. 1955లో ఏఎన్నార్ 'రోజులు మారాయి' చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు వహీదా. అందులో "ఏరువాక సాగారో రన్నో చిన్నన్న" పాటకు ఆమె చేసిన నృత్యం దశాబ్దాల పాటు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అదే ఏడాది ఎన్టీఆర్ 'జయసింహ'లోనూ నటించిన ఆమె.. ఆ తర్వాత ఎక్కువగా హిందీ సినిమాలు చేశారు. మధ్య మధ్యలో 'చుక్కల్లో చంద్రుడు', 'బంగారు కలలు' వంటి తెలుగు సినిమాల్లోనూ మెరిశారు. తెలుగు, తమిళ్, హిందీ సహా పలు భాషల్లో దాదాపు వంద సినిమాల్లో ఆమె నటించారు. 1971 లో విడుదలైన 'రేష్మా ఔర్ షేరా' చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు.
వహీదాను భారత ప్రభుత్వం 1972 లో పద్మశ్రీతో సత్కరించింది. ఆ తర్వాత 2011లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక దాదాసాహేబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు.
![]() |
![]() |