![]() |
![]() |

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేస్తున్న 'పుష్ప' సినిమాపై వెల్లువెత్తుతున్న ఎక్స్‌పెక్టేషన్స్ అసాధారణం. సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తోన్న ఈ ప్యాన్ ఇండియా ఫిల్మ్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రెండు భాగాలుగా తయారవుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌ను క్రిస్మస్‌కు రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా 'పుష్ప'లోని ఫస్ట్ సింగిల్ "దాక్కో దాక్కో మేక"ను ఈ రోజు మార్నింగ్ 11.07 గంటలకు రిలీజ్ చేశారు. అయితే అంతకంటే ముందే, గురువారం రాత్రి ఈ సాంగ్ రఫ్ ట్రాక్ ఆన్‌లైన్‌లో లీకైంది.
ఆ లీక్డ్ వెర్షన్‌ను పక్కనపెడితే, ఈరోజు రిలీజ్ చేసిన ఒరిజినల్ ట్రాక్, విజువల్స్ "వావ్.. సూపర్బ్" అనిపించేలా ఉన్నాయి. మనుషుల నైజం ఎలా ఉంటుందో, జీవిత సత్యాలు ఎలా ఉంటాయో ఈ సాంగ్‌లో లిరిక్ రైటర్ చంద్రబోస్ ఆవిష్కరించారు. దేవి శ్రీప్రసాద్ ఈజ్ బ్యాక్ అనిపించేలా ట్యూన్స్ ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతదాకా 'రాక్‌స్టార్' అని ఫ్యాన్స్ చేత పిలిపించుకుంటూ వచ్చాడు దేవి. ఈ పాటకు టైటిల్ కార్డులో 'సమ్రాట్ ఆఫ్ మ్యూజిక్' అనే ట్యాగ్‌ను దేవికి ఇచ్చాడు సుకుమార్. సింగర్ శివమ్ టిపికల్ వాయిస్ ఈ సాంగ్‌కు మంచి ఎట్రాక్షన్ తీసుకొచ్చింది. సాకీని వి.ఎం. మహాలింగం ఆలపించారు.
"వెల్తురు తింటది ఆకు.. ఆకును తింటది మేక.. మేకను తింటది పులీ.. ఇది కదరా ఆకలీ..
పులినే తింటది చావు.. చావును తింటది కాలం.. కాలాన్ని తింటది కాళీ.. ఇది మహా ఆకలీ.. దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పీక" అంటూ శివమ్ పాడుతుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.. ఒళ్లు జలదరిస్తోంది. ఆకలి అనేది ఎలా ఉంటుందో ఈ లిరిక్స్‌లో చంద్రబోస్ రాసుకొచ్చారు. ఆ వెంటనే "వేటాదేది ఒకటి పరిగెత్తేది ఇంకొకటి.. కొరికిందా ఇది చస్తాది దొరక్కపోతే అది చస్తాది.. ఒక జీవికి ఆకలేసిందా ఇంకో జీవికి ఆయువు మూడిందే" అంటూ ఆకలి కోసం జీవులు ఎలా వేటాడతాయో తెలియజేశారు.
ఈ పాటలో 'పుష్ప'గా అల్లు అర్జున్ మేనరిజమ్స్ ఎలా ఉంటాయో చూపించాడు దర్శకుడు. లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్‌ను పైకి లేపడం, మెడను అటూ ఇటూ ఆడించడం.. తీక్షణంగా చూడటం.. ఇలాంటి మేనరిజమ్స్‌తో సాంగ్‌లో బన్నీ అదరగొట్టేశాడు. ఉంగరాల జుట్టు, పొడవుగా పెరిగిన గడ్డం మీసాలు, భుజాన కండువా, చేతిలో గొడ్డలి.. ఇలా ఇంతదాకా కనిపించని రగ్డ్ లుక్‌లో సరికొత్తగా మనముందు ఆవిష్కృతమయ్యాడు! స్టైలిష్ స్టార్‌గా ఇంతదాకా సినిమాల్లో ఆడియెన్స్‌ను, ఫ్యాన్స్‌ను అలరిస్తూ వచ్చిన బన్నీ.. ఇంత మాస్ లుక్‌లో కనిపించడం ఇదే మొదటిసారి. బహుశా అందుకేనేమో.. డైరెక్టర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్‌ను తీసేసి, ఐకాన్ స్టార్ అనే ట్యాగ్‌ను అల్లు అర్జున్‌కు ఇచ్చాడనిపిస్తోంది.

'దాక్కో దాక్కో మేక' సాంగ్‌లోని ఇంటెన్సిటీ చూస్తుంటే.. ఊహించిన దానికి మించి 'పుష్ప' పవర్‌ఫుల్‌గా మనముందుకు రాబోతున్నాడని అర్థమవుతోంది. మిరొస్లావ్ క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ టెక్నికల్‌గా ఈ సినిమాని వేరే లెవల్‌కు తీసుకువెళ్తుందని చెప్పడానికి ఈ సాంగ్ ఒక శాంపుల్.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో ట్రక్ డ్రైవర్ పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ చెలరేగి నటిస్తుండగా, ఆయన జోడీగా నేషనల్ క్రష్ రష్మికా మందన్న కనిపించనున్నది. ఆమె కూడా ఇంతదాకా చేయని ఒక డిఫరెంట్ రోల్‌ను ఇందులో చేస్తోంది. ఇటీవలి కాలంలో తన ఓటీటీ సినిమాలతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులను అలరిస్తూ, అత్యంత ప్రతిభావంతుడైన యాక్టర్‌గా ప్రశంసలు పొందుతోన్న ఫహద్ ఫాజిల్ విలన్‌గా చేస్తుండటంతో ఈ సినిమాకు మరింత అట్రాక్షన్, హైప్ వస్తోంది. క్రిస్మస్‌కు 'పుష్ప' బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడని "దాక్కో దాక్కో మేక" ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది.
![]() |
![]() |