![]() |
![]() |

ఒకప్పుడు బ్రహ్మానందం లేని సినిమా అంటే ఉప్పు లేని పప్పులా చప్పగా ఉంటుందనే పేరు ఉండేది. అంతలా సిల్వర్ స్క్రీన్‌ని తన హాస్యంతో, తన డైలాగ్స్‌తో, తన హావభావాలతో నవ్వుల మయం చేశారాయన. స్టార్ హీరోకు సమానంగా ఆయన ఇమేజ్ ఉండేది. రెండు దశాబ్దాల పాటు తెలుగు తెరపై నవ్వుల రారాజు ఆయనే. క్రమేణా ఆయన ఖ్యాతి మసకబారటం ప్రారంభించింది. వృద్ధాప్యం మీద పడుతున్న కొద్దీ ఆయనకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఎంతోమంది యువ కమెడియన్లు తెరపైకి రావడంతో ఆయన తెరవెనుకకు తరలి పోతూ వచ్చారు. ఈరోజు బ్రహ్మానందం కావాలని చాలామంది దర్శకులు భావించడం లేదనేది నిజం.
సరే.. ఆ సంగతి అలా ఉంచితే ఇంత కాలమూ తెరపై తాను నవ్వకపోయినా, మనల్ని తెగ నవ్విస్తూ వచ్చిన బ్రహ్మానందం ఓ సినిమాతో మనల్ని ఏడిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సినిమా.. కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తోన్న 'రంగమార్తాండ'. ఈ సినిమాలో బ్రహ్మానందంపై భావోద్వేగపూరితమైన ఓ సన్నివేశం ఉంటుందనీ, ఆ సన్నివేశంలో ఆయన నటన ప్రేక్షకుల మనసుల్ని తడి చేస్తుందనీ తెలిసింది. ఆయన రెగ్యులర్‌గా చేసే పాత్రలకు పూర్తి భిన్నమైన తరహాలో ఆయన పాత్ర ఉంటుందనీ, ఆయన గెటప్ కూడా భిన్నంగానే ఉంటుందనీ అంటున్నారు.
మరాఠీలో నానా పటేకర్ టైటిల్ రోల్ చేయగా ఘన విజయం సాధించిన 'నటసామ్రాట్'కు రీమేక్‌గా 'రంగమార్తాండ' రూపొందుతోంది. ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్ర చేస్తోన్న ఈ మూవీలో ఆయన భార్యగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. టాలీవుడ్‌లో అక్కినేని నాగేశ్వరరావును నటసామ్రాట్ అని పిలుస్తారు కాబట్టి, కృష్ణవంశీ ఒరిజినల్ టైటిల్ ప్లేస్‌లో 'రంగమార్తాండ' టైటిల్‌ను ఎంచుకున్నారు. ఈ సినిమాతో బ్రహ్మానందం మనకు ఒక కొత్త అనుభవాన్ని ఇస్తారని యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు.
![]() |
![]() |