![]() |
![]() |
![]()
లాక్‌డౌన్ కారణంగా 'ఆచార్య' మూవీ షూటింగ్ ఆగిపోయిన దగ్గర్నుంచీ మెగాస్టార్ చిరంజీవి ఇంటిలోనే గడుపుతున్నారు. ఈ టైమ్‌లోనే అభిమానులతో తన భావాలను పంచుకొనేందుకు, ఇంట్లో తను చేస్తున్న పనులను షేర్ చేసుకొనేందుకు సోషల్ మీడియానే మార్గమని గ్రహించిన ఆయన ఇటు ట్విట్టర్, అటు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను స్టార్ట్ చేశారు. అప్పట్నుంచీ ఆయన సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. తను చేస్తున్న వంటల దగ్గర్నుంచీ, మొక్కలకు నీళ్లు పోయడం దాకా రకరకాల అంశాలను షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు నాలుగు నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు నిత్యావసరాలను అందించే ఏర్పాట్లు కూడా చూసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఆదివారం ఆయన మీసాలు లేకుండా సరికొత్త రూపంతో దర్శనమిచ్చారు. అయితే అది తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కాదు. 2018లో విడుదలైన 'బ్లఫ్‌మాస్టర్' మూవీని తన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి లేటెస్ట్‌గా చూసిన ఆయన, దాని డైరెక్టర్ గోపీ గణేశ్‌ను తన ఇంటికి పిలిపించుకున్నారు. సత్యదేవ్ టైటిల్ పోషించిన ఆ మూవీ తనకు బాగా నచ్చిందనీ, ఒక వండర్‌ఫుల్ మూవీ తీశావంటూ గోపీ గణేశ్‌ను ఆయన ప్రశంసించారు. సినిమాలో గణేశ్ రాసిన డైలాగ్స్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించి మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా గోపీగణేశ్‌తో ఆయన ఫొటో దిగారు. ఈ ఫొటోలో మెగాస్టార్ నీట్ షేవ్‌తో దర్శనమిచ్చారు. పైగా మీసాలు కూడా తీసేయించుకున్నారు. దీనికి ప్రత్యేక కారణమేమన్నా ఉందా, లేక క్యాజువల్‌గా మీసాలు తీయించారా.. అనే విషయం వెల్లడి కాలేదు.
ఏదేమైనా మెగాస్టార్ అంతటివాడు తనను ఇంటికి పిలిపించుకొని, తన సినిమాని మెచ్చుకోవడంతో గోపీగణేశ్ ఆనందానికి అవధులు లేవు. ఆయనది పెద్ద మనసు కాబట్టే తన సినిమా చూడటంతో ఆగకుండా పిలిపించుకొని మరీ మెచ్చుకున్నారంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆనందాన్ని పంచుకున్నాడు.
![]()
![]() |
![]() |