![]() |
![]() |

`శివ` (1989) వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ తరువాత సరైన విజయం లేని కింగ్ నాగార్జునను.. మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చిన చిత్రం `ప్రెసిడెంటు గారి పెళ్ళాం`. టైటిల్ రోల్ లో మీనా నటించిన ఈ సినిమాకి ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కుటుంబ కథా చిత్రంలో అనూహ్య పరిస్థితుల్లో ప్రెసిడెంటు అయ్యే రాజా అనే యువకుడి పాత్రలో నాగ్ మాస్ ని ఎంటర్టైన్ చేయగా.. అతనికి జోడీగా మీనా అలరించింది. కైకాల సత్యనారాయణ, శ్రీకాంత్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, రాజా, చిట్టిబాబు, సుధ, అన్నపూర్ణ, హరిత, బేబి సునయన ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించగా.. డిస్కో శాంతి ఓ ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేశారు.
స్వరవాణి కీరవాణి బాణీలకు దిగ్గజ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి పదరచన చేశారు. ``నువ్వు మల్లెతీగ``, ``ఉమ్మ కావాలి``, ``ఆ ఒడ్డు ఈ ఒడ్డు``, ``తస్సాచెక్క``, ``మండూరి``, ``పరువాల కోడి``.. ఇలా ఇందులోని గీతాలన్ని మాస్ ని ఉర్రూతలూగించాయి. వి.ఎం.సి. ప్రొడక్షన్స్ పతాకంపై వి. దొరస్వామిరాజు నిర్మించిన `ప్రెసిడెంటు గారి పెళ్ళాం`.. తమిళంలో `తలైవర్ పొండాట్టి` పేరుతో అనువాదమై అక్కడి వారిని కూడా ఆకట్టుకుంది. 1992 అక్టోబర్ 30న విడుదలై ఘనవిజయం సాధించిన `ప్రెసిడెంటు గారి పెళ్ళాం`.. నేటితో 29 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |