![]() |
![]() |

చిన్నతనంలోనే కుటుంబ సభ్యులను కోల్పోయి వేరుపడిన బావామరదళ్ళు.. ఒకరికి తెలియకుండా మరొకరు శత్రువులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నారనే కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం `అతనొక్కడే`. నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ రోల్ లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తోనే స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకుడిగా తొలి అడుగేశారు. మొదటి ప్రయత్నంలోనే మెమరబుల్ హిట్ ని సొంతం చేసుకున్నారు. కళ్యాణ్ రామ్ కి జోడీగా సింధు తులాని నటించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, ఆశిష్ విద్యార్థి, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, వేణు మాధవ్, చలపతిరావు, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, సుదీప ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
మెలోడీబ్రహ్మ మణిశర్మ అందించిన పాటలు, నేపథ్య సంగీతం `అతనొక్కడే`కి ప్రధాన బలంగా నిలిచాయి. ``చిటపట``, ``గుండెలలో``, ``అతనొక్కడేలే``, ``అమ్మ దేవుడో``, ``నాటీ గాళ్``, ``మేఘమాల``.. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి జానకి రామ్ నిర్మించిన `అతనొక్కడే`.. తమిళంలో `ఆది` (విజయ్, త్రిష) - కన్నడంలో `లక్ష్మణ` (అనూప్, మేఘనా రాజ్) పేర్లతో రీమేక్ అయింది. అలాగే `ఉత్తమ నూతన దర్శకుడు`, `ఉత్తమ గుణచిత్ర నటుడు` (చంద్రమోహన్) విభాగాల్లో `నంది` పురస్కారాలను, `ఉత్తమ ప్రతినాయకుడు` (ఆశిష్ విద్యార్థి) విభాగంలో `ఫిల్మ్ ఫేర్` అవార్డుని అందుకుంది. కాగా, 2005 మే 7న విడుదలై ఘనవిజయం సాధించిన `అతనొక్కడే`.. నేటితో 17 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |