Home

»

Latest News

`రౌడీ ఇన్ స్పెక్ట‌ర్`గా బాల‌య్య మెస్మ‌రైజ్ చేసి నేటికి 30 ఏళ్ళు!

May 7, 2022 12:15PM

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కి అచ్చొచ్చిన ద‌ర్శ‌కుల్లో బి. గోపాల్ ఒక‌రు. బాల‌య్య - గోపాల్ కాంబినేష‌న్ లో ఐదు చిత్రాలు రాగా.. వాటిలో నాలుగు సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. అందులో `రౌడీ ఇన్ స్పెక్ట‌ర్` ఒక‌టి. ఇందులో సిన్సియ‌ర్ పోలీసాఫీస‌ర్ రామ‌రాజుగా బాల‌య్య త‌న న‌ట‌న‌తో మెస్మ‌రైజ్ చేశారు. బాల‌కృష్ణ‌కి జోడీగా లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి న‌టించిన ఈ కాప్ డ్రామాలో హ‌రీశ్, జ‌గ్గ‌య్య‌, కెప్టెన్ రాజు, మోహ‌న్ రాజ్, కోట శ్రీ‌నివాస‌రావు, బ్ర‌హ్మానందం, అలీ, నూత‌న్ ప్ర‌సాద్, సాయికుమార్, శ్రీ‌హ‌రి, కిన్నెర‌, హేమ‌, అన్న‌పూర్ణ‌, నిర్మ‌ల‌మ్మ, పాకీజా ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చిన ఈ చిత్రానికి వి.ఎస్.ఆర్. స్వామి అందించిన ఛాయాగ్ర‌హ‌ణం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

బ‌ప్పీల‌హ‌రి స్వ‌ర‌ప‌రిచిన గీతాల‌కు భువ‌న‌చంద్ర సాహిత్య‌మందించగా ఎస్పీబీ  - చిత్ర గానం చేశారు. ఇందులోని ``డిక్కీ డిక్కీ``, ``అరె వో సాంబ‌``, `ట‌క్కుట‌మార బండి``, ``నీలాల నింగి``, ``చిట‌ప‌ట చినుకులు``, ``ఓ పాపాయో``.. ఇలా ప్ర‌తీ పాట‌ మాస్ ఆడియ‌న్స్ ని ఉర్రూత‌లూగించింది. విజ‌య‌ల‌క్ష్మి ఆర్ట్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై టి. త్రివిక్ర‌మ‌రావు నిర్మించిన `రౌడీ ఇన్ స్పెక్ట‌ర్`.. 1992 మే 7న విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించింది. నేటితో ఈ చిత్రం 30 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com