![]() |
![]() |

మ్యూజిక్ మేస్ట్రో ఎ.ఆర్. రెహమాన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి కరీమా బేగమ్ సోమవారం చెన్నైలో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ వచ్చిన ఆమె తన ఇంట్లో చివరి శ్వాస విడిచారు.
తన మాతృమూర్తి మృతి వార్తను ఓ ఫొటోతో షేర్ చేస్తూ రెహమాన్ స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ధ్రువీకరించారు. తల్లి అంటే ఆయనకు ప్రాణంతో సమానం. అనేక సందర్భాల్లో, ఇంటర్వ్యూలలో తనకు తల్లి ఎంత సన్నిహితురాలో, తను మ్యూజిక్‌ను వృత్తిగా చేపట్టడంలో ఆమె ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చారో, తన ఉన్నతి కోసం ఆమె ఎంతగా తపించారో ఆయన తెలిపారు.
తన తల్లి ఒక ఆధ్యాత్మికవేత్తగా ఆయన అభివర్ణించారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె ప్రభావం తనపై చాలా ఎక్కువ అని చెప్పారు రెహమాన్. రెహమాన్ 12వ క్లాస్‌తో చదువు ఆపేసి, మ్యూజిక్‌ను కెరీర్‌గా తీసుకోవడం వెనుక ఉన్నది ఆమే. మొదట తల్లిదండ్రులు పెట్టిన పేరు దిలీప్. ఆయన తొమ్మిదేళ్ల బాలుడిగా ఉన్నప్పుడే ఆయన తండ్రి, సంగీత దర్శకుడు ఆర్.కె. శేఖర్ మరణించారు.
హిందువులైన వారు తర్వాత సూఫీ మతంలోకి మారారు. దిలీప్ కాస్తా రెహమాన్‌గా మారగా, ఆయన తల్లి కస్తూరి తన పేరును కరీమా బేగమ్‌గా మార్చుకున్నారు.
![]() |
![]() |