
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి వరల్డ్‌వైడ్‌గా ఎంత అప్రిషియేషన్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఏకంగా ఆస్కార్ అవార్డునే సాధించిన ఈ సినిమా నేషనల్ అవార్డులలో సైతం తన సత్తా చాటుకుని ఎవర్‌గ్రీన్ చిత్రంగా నిలిచింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటన, రాజమౌళి టేకింగ్, డివివి దానయ్య మేకింగ్, టెక్నికల్ హైలైట్స్ గురించి అందరూ అప్రిషియేట్ చేశారు.
తాజాగా ఈ చిత్రానికి ఓ అరుదైన గౌరవం దక్కింది. బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాషియో లూలా దా సిల్వ చిత్రాన్ని చూసి యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించి ఆయన మాట్లాడుతూ ‘మూడు గంటల రన్‌టైమ్‌తో ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ నాకెంతో నచ్చింది. డైరెక్టర్ అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అలాగే ఆర్టిస్టులు కూడా అద్భుతంగా పెర్‌ఫార్మ్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో డాన్స్ నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా యూనిట్‌లోని అందర్నీ అభినందిస్తున్నాను’ అన్నారు.
మనదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఎస్.ఎస్.రాజమౌళికి వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇంతకుముందే ‘బాహుబలి’ సిరీస్‌తో అది ప్రూవ్ అయింది. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీతో మరోసారి రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి.