![]() |
![]() |

సీనియర్ తమిళ నటుడు నాజర్ తెలుగులోనూ పాపులరే. ఎన్నో చిత్రాల్లో నెగటివ్, పాజిటివ్ రోల్స్‌లో తనదైన అభినయాన్ని ప్రదర్శించి విమర్శకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. 'కోకిల' (1989) నుంచే తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ వస్తోన్న ఈ విలక్షణ నటుడు 'బాహుబలి' మూవీలో భల్లాలదేవ తండ్రి బిజ్జలదేవునిగా నెగటివ్ రోల్ పోషించి, మరోసారి దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించారు.
నాజర్ ఎంత గొప్ప నటుడంటే ఒకసారి ఆయన నటనకు 'చెప్పు' బహుమానంగా లభించింది. అంటే అంతగా ఆ పాత్రలో జీవించి, ప్రేక్షకుల ఆగ్రహానికి కారకులయ్యారన్న మాట. మణిరత్నం డైరెక్ట్ చేసిన క్లాసిక్ ఫిల్మ్ 'నాయకన్' జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. ఆ సినిమాలో కమల్ హాసన్ పోషించిన టైటిల్ రోల్‌కు ఎంతటి పేరు వచ్చిందో, అసిస్టెంట్ కమిషనర్ పాటిల్ (కమల్ హాసన్ అల్లుడు)గా నటించిన నాజర్కూ అంతటి పేరు తెచ్చిపెట్టింది.
ఏమాత్రం జాలీ, సానుభూతి లేని కర్కశ పోలీస్ ఆఫీసర్‌గా ఆ పాత్రలో జీవించినందుకు ఆయనకు ఆ కాలంలో మద్రాస్ నగరంలో అరుదైన బహుమతి లభించింది. ఆ సినిమా చూసిన ఓ సున్నిత మనస్కుడు నాజర్ ప్రదర్శించిన కర్కశత్వానికి చలించిపోయి, ఆయన కారులో సిటీలో వెళ్తుండగా ఒక చెప్పును గిఫ్ట్‌గా ఇచ్చాడు. తన మెమొంటోల మధ్యన ఆ చెప్పుకూ స్థానం ఇచ్చారు నాజర్. ఆ సినిమాలో నా నటనను ఎందరో మెచ్చుకున్నారు. కానీ ఈ కానుకే అన్నిటికన్నా ఉత్తమమైన ప్రశంసగా భావిస్తున్నాను అని చెప్పారు నాజర్. అదీ ఆయన పాత్రలో జీవించే వైనం!
![]() |
![]() |