![]() |
![]() |

టాలీవుడ్ లో వెయ్యికిపైగా చిత్రాల్లో నటించి తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు రామలింగయ్య. తనదైన కామెడీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. నేడు (అక్టోబర్ 1) అల్లు రామలింగయ్య గారి శతజయంతి సందర్భంగా అల్లు స్టూడియోలో ఆయన విగ్రహాన్ని అల్లు వారసులు ఆవిష్కరించారు.
అల్లు రామలింగయ్య 1922 అక్టోబర్ 1న పాలకొల్లులో జన్మించారు. హోమియోపతి వైద్యాన్ని అభ్యసించి, చుట్టూ ఉన్నవారికి తగిన వైద్యం చేస్తూ.. మరోవైపు తనకు ఇష్టమైన నాటకాలు వేస్తూ ఉండేవారు. 1950 లో 'పుట్టిల్లు' అనే సినిమా ద్వారా చిత్రసీమకు పరిచయమైన అల్లు రామలింగయ్య.. వెయ్యికిపైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆయనకు పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డులు కూడా వరించాయి. మెగా ఫ్యామిలితో పాటు అల్లు ఫ్యామిలీలో ఎంతో మంది రామలింగయ్య వారసత్వంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్ సినీ నిర్మాతగా తనదైన ముద్రవేయగా.. మనవళ్లు అల్లు అర్జున్, శిరీష్ హీరోలుగా రాణిస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ జెనరేషన్ టాప్ స్టార్స్ లో ఒకరిగా దూసుకుపోతున్నారు.
రామలింగయ్య స్మారకార్థం అల్లు ఫ్యామిలీ హైదరాబాద్‌లో 'అల్లు స్టూడియోస్' నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆయన మనవళ్లు అల్లు వెంకటేష్, అర్జున్, శిరీష్ లు తమ తాతకు ఘన నివాళులు అర్పించారు. స్టూడియోలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని మనవళ్లు ఆవిష్కరించారు. ఈ విషయాన్ని బన్నీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంలో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. "ఈ రోజు మా తాత పద్మశ్రీ రామలింగయ్య గారి జయంతిన వారి విగ్రహాన్ని ఆవిష్యరించాము. ఈ కార్యక్రమంలో నాతో పాటు వెంకటేష్, శిరీష్ పాల్గొన్నారు. ఆయన మా గర్వకారణం, అల్లు స్టూడియోస్ నిర్మాణ ప్రయాణంలో తోడుగా ఉంటారు" అని పోస్ట్ చేశారు.
![]() |
![]() |