![]() |
![]() |
టాలీవుడ్ నిర్మాతలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆదాయ పరంగా ఎంత ఉపయోగకరంగా ఉందో, అంతే నష్టం కలిగించేలా ఉందన్న వాదన వినిపిస్తోంది. గతంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత 8 వారాలకు ఓటీటీలో స్ట్రీమ్ చేసుకునేలా అగ్రిమెంట్స్ చేసుకునేవారు. కొన్నాళ్ళ క్రితం ఓటీటీ అగ్రిమెంట్ విధానంలో భారీగా మార్పులు జరిగాయి. సినిమా రిలీజ్ అయిన నాలుగు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమ్ చేసే విధంగా అగ్రిమెంట్ చేస్తేనే సినిమాలు కొంటామని ఆయా సంస్థలు షరతు పెట్టడంతో తప్పని పరిస్థితుల్లో నిర్మాతలు కూడా ఓకే చెప్పారు. ఒకవిధంగా చూస్తే ఓటీటీ సంస్థలు తెలుగు సినిమాను, తెలుగు నిర్మాతలను శాసిస్తుందనే అనుకోవాలి. వాళ్ళు అగ్రిమెంట్ విషయంలో ఎలాంటి మార్పులు చేసినా ఓకే చెప్పడం తప్ప నిర్మాతలకు మరో ఆప్షన్ లేదన్నది ట్రేడ్‌వర్గాల అభిప్రాయం.
క్రిస్మస్, సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాలకు ఇదే పరిస్థితి ఎదురైంది. డిసెంబర్ 22న విడుదలైన ప్రభాస్ సినిమా ‘సలార్’ను జనవరి 20న నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేసింది. అలాగే డిసెంబర్ 29న రిలీజ్ అయిన నందమూరి కళ్యాణ్‌రామ్ ‘డెవిల్’ చిత్రాన్ని మరీ ఘోరంగా జనవరి 14నే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కి పెట్టారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన మహేష్‌బాబు ‘గుంటూరు కారం’ చిత్రాన్ని కూడా నాలుగు వారాలలోపే స్ట్రీమింగ్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు వినిపిస్తున్న వార్తల ప్రకారం ఫిబ్రవరి 9 లేదా 10 తేదీల్లోనే స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ఇక వెంకటేష్ హీరోగా రూపొందిన ‘సైంధవ్’ చిత్రం జనవరి 13న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను కూడా ఫిబ్రవరి 9 లేదా 10 తేదీల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుందని సమాచారం. ఓటీటీ సంస్థల మధ్య ఉన్న పోటీ కారణంగా అగ్రిమెంట్ పూర్తయిన వెంటనే స్ట్రీమింగ్ చేసేందుకు ఆయా సంస్థలు రెడీ అయిపోతున్నాయి. ప్రస్తుతం టాప్ హీరోల సినిమాల బడ్జెట్ భారీగానే ఉంటున్న విషయం తెలిసిందే. వాళ్ళు చేసిన బిజినెస్‌కి బ్రేక్ ఈవెన్ రావాలంటే నాలుగు వారాలు సరిపోవడం లేదనేది అంతటా వినిపిస్తున్న మాట.
![]() |
![]() |