![]() |
![]() |

ఏ ముహూర్తాన ఈ సినిమాకు బాపు, రమణలు ’సాక్షి‘ అని పేరు పెట్టారో కానీ... చాలా విషయాలకూ, విశేషాలకూ ఈ సినిమా ’సాక్షి‘గా నిలిచింది. ఈ సినిమా విడుదలై యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంలో వాటిని స్మరించుకోవడం సినీ అభిమానులుగా మన బాధ్యత.

'సాక్షి‘ అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది బాపూరమణలు. అప్పటి వరకూ చిత్రకారుడు మాత్రమే అయిన తన ప్రాణ మిత్రుడు బాపును, దర్శకుడిగా చూడటానికి రచయిత ముళ్లపూడి వెంకటరమణ చేసిన సాహసం ఈ సినిమా. ఎవరిదగ్గరా పనిచేయకుండా ఏకంగా మెగాఫోన్ పట్టేశారు బాపు. యాభై వేలు అప్పు చేసి మరీ ఈ సినిమాను నిర్మించారు రమణ. అప్పట్లో యాభై వేలంటే పెద్దమొత్తమే మరి. ఇంత కష్టపడి తీస్తే, మంచి పేరైతే వచ్చింది కానీ... డబ్బులు మాత్రం రాలేదు. ఏది ఏమైనా అప్పట్నుంచి నాలుగు దశాబ్దాల పాటు వెండితెరపై తెలుగు వెలుగుల్ని విరజిమ్మారు ఈ మిత్ర ధ్వయం. ఆ విధంగా యాభై ఏళ్ల వారి సినీ ప్రయాణానికి ’సాక్షి‘గా నిలించిందీ సినిమా.
.jpg)
చక్కని దాంపత్యానికి ’70 ఎం.ఎం స్ర్కీన్‘ అంత నిదర్శనంగా నిలిచిన జంట కృష్ణ, విజయనిర్మల. వీరిద్దరినీ అగ్ని ’సాక్షి‘గా కలిపిన సినిమా కూడా సాక్షే. కృష్ణ, విజయనిర్మల కలిసి నటించిన తొలి చిత్రం ఇది. ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే స్నేహంగా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారింది.

’అమ్మ కడుపు చల్లగా.. అత్త కడుపు చల్లగా, బతకరా బతకరా పచ్చగా‘ పాట ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. ఆ పాట చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ సంఘటనే కృష్ణ, విజయనిర్మల పెళ్లికి దారి తీసేలా చేసింది. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ మారు మూల పల్లెటూరిలో ఈ సినిమాను తెరకెక్కించారు బాపు. అక్కడున్న మీసాల వేణుగోపాల స్వామి దేవాలయం చాలా మహిమ గలది.
.jpg)
ఆ గుడిలో పెళ్లి జరిగితే, ఇక ఆ జంట విడిపోరని అక్కడి ప్రజల నమ్మకం. ఆ గుడిలోనే ఈ పాటను తీశారు. కథ రిత్యా ఈ పాటలో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలి. బాపుగారి మాట ప్రకారం కృష్ణ తాళి కట్టారు. తర్వాత ఇద్దరూ తలంబ్రాలు పోసుకున్నారు. లొకేషన్లో ఈ తంతంగాన్నంతా చూస్తున్న కామెడీ కింగ్ రాజబాబు ’’ఇక్కడ పెళ్లి జరిగితే జీవితాంతం విడిపోరట. ఇది సినిమా పెళ్లయినా... ఎందుకో నిజమవుతుందేమో అనిపిస్తుంది‘‘ అనేశారట. ఆయన అన్నట్టే.. ఆ తర్వాత కృష్ణ, విజయనిర్మల నిజ జీవితంలో పెళ్లితో ఒకటయ్యారు. ఆ విధంగా వారిద్దరినీ అగ్ని ’సాక్షి‘గా ఒకటి చేసిందీ సినిమా.

కృష్ణ ముడొందల పై చిలుకు చిత్రాల్లో నటించినా.. నటునిగా ’సాక్షి‘ మాత్రం ఆయనకు ప్రత్యేకం. స్వతహాగా డేరింగ్, డాషింగ్ పాత్రలు చేసే కృష్ణ... ఈ సినిమాలో పిరికివాడిగా నటించారు. ఆయనలో అద్భుతమైన నటుడున్నాడని తెలిపిన సినిమా కూడా సాక్షే.

ఈ సినిమా చేసిన 15 ఏళ్లకు మళ్లీ కృష్ణ, బాపు, ముళ్లపూడి కాంబినేషన్లో ’కృష్ణావతారం‘ సినిమా రూపొందింది. ఆ సినిమా షూటింగ్లో గమ్మత్తయిన సంఘటన జరిగింది. కృష్ణపై ఓ సన్నివేశం తీస్తున్నారు బాపు. అయితే... కృష్ణ నటన మాత్రం బాపుకు అంత సంతృప్తి కరంగా అనిపించట్లేదు. అందుకే మరో టేక్ అన్నారు. మళ్లీ కృష్ణ అలాగే చేశారు. అలా ఆరేడు టేకులు తీసుకున్నారు కృష్ణ. ఇక ఎనిమిదో టేక్ చేసేసి, కృష్ణే ’ఓకే‘ అనేశారు. అవాక్కవ్వడం బాపు వంతైంది. డైరెక్టర్ని నేనైతే... మీరు ’ఓకే‘ అంటారేంటి? అనడిగారు కోపంగా. ’’ ’సాక్షి‘ చేసి 15 ఏళ్లు అయ్యింది కదా... కృష్ణ నటనలో రాటుదేలి ఉంటాడూ..అనుకుంటున్నారేమో... నేను అప్పడు, ఇప్పుడు ఒకేలా ఉన్నా. నాలో ఏ మార్పూ లేదు. మీరు ఇంకో పది సార్లు తీసినా ఇంతే‘‘ అని మొహమాటం లేకుండా చెప్పేశారట కృష్ణ. తనమీద తనే సెటైర్ వేసుకోవడం కృష్ణ గొప్ప తనం కాక మరేంటి!
ఏది ఏమైనా తెలుగు ప్రజలకు అపురూమైన మెమోరీస్ అందించిన యాభై ఏళ్ల ’సాక్షి‘ సినిమాకు మనందరం థ్యాంక్స్ చెప్పేద్దాం.
![]() |
![]() |