![]() |
![]() |
.jpg)
కథానాయికల కొరత అన్ని చోట్లా ఉన్నదే. కాకపోతే స్టార్ హీరో అనగానే హీరోయిన్లు ఎవరైనా సరే, ఎగురుకొంటూ వచ్చేస్తారని ఫీలవుతుంటారు. ఇది వరకు ఇలానే ఉండేది. పేరున్న హీరో పిలిస్తే.. ముందూ వెనుకా చూడకుండా రంగంలోకి దూకేసేవారు కథానాయికలు. ఇప్పుడలా కాదు. పిలిచినప్పుడే.. పరపతి చూపించాలని అనుకొంటున్నారు. పారితోషికాలు, షరతులు అంటూ పెద్ద సినిమాల్నీ ఇరకాటంలో పెట్టేస్తున్నారు. అందుకు ఎన్టీఆర్ సినిమానే ఉదాహరణ. ఎన్టీఆర్ కథానాయకుడిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 10న సెట్స్‌పైకి వెళ్తుంది. నెల రోజుల నుంచి కథానాయికల కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. అయినా ఇప్పటి వరకూ కథానాయికలు ఫిక్స్ కాలేదు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు, ముగ్గురు హీరోయిన్లు కావాలిప్పుడు. స్టార్ హీరోయిన్లు ఖాళీగా లేరు. కొత్తవాళ్లదీ అదే పరిస్థితి. పిలిచి అవకాశం ఇస్తే నంటే.. నెత్తికెక్కి కూర్చుంటున్నారు. చుక్కలు చూపిస్తున్నారు. కీర్తి సురేష్‌కి ముందు ఛాన్స్ దొరికింది. తానేమో పారితోషికం భారీగా అడగడంతో కల్యాణ్ రామ్ కళ్లు బైర్లు కమ్మాయట.
రాశీఖన్నా ఫిక్సయ్యింది గానీ...`కాల్షీట్లు లాటుగా ఇవ్వలేను. నాకు ఖాళీ ఉన్నప్పుడు షూటింగ్ చేసుకోండి` అంటూ కండీషన్లు పెడుతోందట. ఇప్పుడు మరో కథానాయికగా నివేదా థామస్‌ని తీసుకొన్నారు. తానేమో.. `ఏప్రిల్‌లో షూటింగులు పెట్టుకోకండి. అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి.. మార్చిలో కూడా కుదరదు.. నేను చదువుకోవాలి` అంటూ కండీషన్లు పెడుతోందట. హీరోయిన్ల లెక్క తేలకపోవడంతో ఎన్టీఆర్ సినిమా ఇప్పుడు గందరగోళంలో పడింది. టాప్ స్టార్ సినిమాలో నటించడానికే హీరోయిన్లు ఇన్ని కండీషన్లు పెడుతుంటే.. కొత్త వాళ్ల సంగతి వేరే చెప్పాలా?
![]() |
![]() |