Home  »  News  »  రా ఎన్టీఆర్ vs ఎన్టీఆర్ టీమ్.. జూనియర్‌కి తెలిసే ఇదంతా జరుగుతుందా.?

Updated : Jul 15, 2026

గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై జోరుగా సాగుతున్న ఊహాగానాల మధ్య, ఇప్పుడు సరికొత్త వివాదం టాలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం 'రా ఎన్టీఆర్' (RAW NTR) అనే సంస్థ చుట్టూ తిరుగుతోంది. ఎన్టీఆర్ అభిమానుల కోసం, సామాజిక సేవా కార్యక్రమాల కోసం తాము పనిచేస్తున్నామని చెబుతున్న ఈ సంస్థ, ఇప్పుడు అనూహ్యంగా వార్తల్లో నిలిచింది. ఒకవైపు ఈ సంస్థ, మరోవైపు ఎన్టీఆర్ అధికారిక కార్యాలయం మధ్య మొదలైన 'మాటల యుద్ధం' ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి ప్రధాన కారణం ఇటీవల జూలై 18న ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించిన ఏదో ఒక కీలక ప్రకటన చేయబోతున్నారని సోషల్ మీడియాలో జరిగిన భారీ ప్రచారం. ఈ ప్రచారంలో 'రా ఎన్టీఆర్' సంస్థ పేరు ప్రముఖంగా వినిపించింది.

'ఊరు వాడ' పేరుతో రూ.100 కోట్ల సేవా యజ్ఞం చేయబోతున్నామని, దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ జూలై 18న చేయబోతున్నామని 'రా ఎన్టీఆర్' ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమం స్వయంగా ఎన్టీఆర్ చేస్తున్నాడని అందరూ భావించారు. తమిళనాడులో దళపతి విజయ్ తరహాలోనే ముందుగా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఎన్టీఆర్ ప్లాన్ అంటూ ప్రచారం మొదలైంది.

ఈ ప్రచారం రోజురోజుకి ముందుతుండటంతో ఎన్టీఆర్ కార్యాలయం, ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. రా ఎన్టీఆర్ అనే సంస్థకు, ఎన్టీఆర్‌కు లేదా ఆయన కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ పేరుతో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించే హక్కు ఆ సంస్థకు లేదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా, ఎన్టీఆర్‌కు సంబంధించిన ఏ సమాచారం అయినా కేవలం అఫీషియల్ టీమ్ ద్వారానే వెలువడుతుందని, ఇతర సోషల్ మీడియా లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వచ్చే వార్తలను నమ్మవద్దని అభిమానులను కోరింది. 

అయితే ఈ ప్రకటనతో వివాదం సద్దుమణగలేదు. రా ఎన్టీఆర్ సంస్థ ఫౌండర్ సాయి రూప్ దీనిపై ఘాటుగా స్పందించారు. తమ సంస్థ గత ఏడేళ్లుగా నిరంతరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, వేలాది మంది వాలంటీర్లు తమతో కలిసి పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తమ ఉద్దేశం కేవలం సేవ మాత్రమేనని, రాజకీయాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని సాయి రూప్ స్పష్టం చేశారు. 

అంతేకాదు, ఎన్టీఆర్ కార్యాలయం పేరుతో విడుదలైన ఆ లేఖపైనే ఆయన అనేక సందేహాలు వ్యక్తం చేశారు. ఆ లేఖ గురించి స్వయంగా ఎన్టీఆర్‌కే తెలిసి ఉండకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎన్టీఆర్ స్వయంగా వచ్చి తమను ఆపమంటే, వెంటనే అన్ని కార్యక్రమాలను నిలిపివేస్తామని సాయి రూప్ ప్రకటించడం గమనార్హం. తమకు ఎన్టీఆర్ దేవుడితో సమానమని, ఆయన పేరుతో సేవ చేయడమే తమ ఏకైక లక్ష్యమని వారు చెబుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు అభిమానుల్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. కొందరు ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటనను ఫైనల్ అని నమ్ముతుంటే, మరికొందరు రా ఎన్టీఆర్ సంస్థ గత ఏడేళ్లలో చేసిన సేవా కార్యక్రమాలను గుర్తు చేస్తున్నారు. రాజకీయ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో, ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ స్వయంగా దీనిపై స్పందిస్తారా, లేక ఈ ప్రకటనలతోనే వివాదం ముగుస్తుందా అనేది ఇప్పుడు అందరిలోనూ నెలకొన్న ప్రశ్న. ఏదేమైనా, ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ సాగుతున్న ఈ పరిణామాలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

 

 

Jr NTR, Raw NTR, Politics, TeluguOne

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.