Home  »  News  »  మైఖేల్ బయోపిక్ సరికొత్త రికార్డు.. బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయిల సునామీ

Updated : Jul 14, 2026

 

 

హాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా ఒక సరికొత్త రికార్డు నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను దశాబ్దాల పాటు తన డ్యాన్స్  పాటలతో ఊపేసిన పాప్ దిగ్గజం, లెజెండరీ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మైఖేల్' (Michael Movie) బయోపిక్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాకుండా, ప్రేక్షకుల గుండెల్లో బలమైన ముద్ర వేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1 బిలియన్ డాలర్స్ అంటే  సుమారుగా  9,500 కోట్లకి పైగా  వసూళ్ల మైలురాయిని దాటి సరికొత్త చరిత్రని  లిఖించింది. సినిమా చరిత్రలోనే ఈ స్థాయి భారీ వసూళ్లను సాధించిన మొట్టమొదటి బయోపిక్ చిత్రంగా మైఖేల్ గ్లోబల్ రికార్డులను తిరగరాసింది.

దర్శకుడు ఆంటోనీ ఫుక్వా అద్భుతమైన విజన్‌తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటించడం విశేషం. జాఫర్ జాక్సన్‌కు ఇదే తొలి సినిమా అయినప్పటికీ, తన నటనతో మరియు డ్యాన్స్ మూమెంట్స్‌తో మైఖేల్ జాక్సన్‌ను స్క్రీన్ పై పునఃసృష్టి చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. ఏప్రిల్ 2026 లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, తొలి వీకెండ్‌లోనే అమెరికాలో 97.2 మిలియన్ డాలర్లు, ప్రపంచవ్యాప్తంగా 217 మిలియన్ డాలర్లు వసూలు చేసి అప్పట్లోనే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించిన మ్యూజికల్ బయోపిక్‌గా నిలిచింది. రన్‌టైమ్ ముగిసే సరికి ఈ సినిమా ఏకంగా 1.001 బిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకుని ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

ఈ చారిత్రాత్మక విజయంతో గతంలో అత్యధిక వసూళ్లు సాధించిన మ్యూజికల్ బయోపిక్ 'బోహేమియన్ రాప్సడీ' (911 మిలియన్ డాలర్లు) రికార్డును మైఖేల్ సులువుగా బద్దలు కొట్టింది. అంతేకాకుండా, రియల్ లైఫ్ పర్సన్ ఆధారంగా తెరకెక్కిన చిత్రాల విభాగంలో లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన ఆస్కార్ అవార్డుల విజేత 'ఓపెన్‌హైమర్' (975.8 మిలియన్ డాలర్లు) కలెక్షన్లను కూడా దాటేసి ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన నంబర్ వన్ బయోపిక్‌గా అవతరించింది. గ్లోబల్ మార్కెట్‌లో ఈ చిత్రం సాధించిన 629.8 మిలియన్ డాలర్లు, అలాగే నార్త్ అమెరికాలో సాధించిన 371.8 మిలియన్ డాలర్ల వసూళ్లు హాలీవుడ్ దిగ్గజ సంస్థ లయన్స్ గేట్ చరిత్రలోనే మొదటిసారిగా ఒక బిలియన్ మార్కును దాటిన చిత్రంగా నిలిచింది.

Also read: Kiran abbavaram: కిరణ్ అబ్బవరంపై ఈ  హీరోలు పగబట్టారా!.. 24 న ఏం జరగబోతుంది

సినిమా థియేటర్లలో సాధించిన ఈ కలెక్షన్ల ప్రభంజనం కేవలం బాక్సాఫీస్ వద్దే ఆగలేదు. ఈ సినిమా విడుదల తర్వాత మైఖేల్ జాక్సన్ పాపులారిటీ సోషల్ మీడియాలో, మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలో అమాంతం పెరిగిపోయింది. ప్రముఖ ఆడియో ప్లాట్‌ఫామ్ స్పాటిఫై (Spotify)లో మైఖేల్ జాక్సన్ మంత్లీ లిజనర్స్ సంఖ్య కేవలం 68 మిలియన్ల నుండి ఏకంగా 105 మిలియన్లకు పెరిగిపోవడం ఒక రికార్డు. అలాగే ఆయన పాడిన టాప్ 60 పాటల స్ట్రీమింగ్స్ ఒక్కసారిగా 467 మిలియన్ల నుండి 1.21 బిలియన్లకు చేరుకున్నాయి. కింగ్ ఆఫ్ పాప్ క్రేజ్ దశాబ్దాలు గడిచినా ప్రపంచవ్యాప్తంగా ఏమాత్రం తగ్గలేదని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ చిత్రం, త్వరలోనే మరింత మంది ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.