Home  »  News  »  ఒకే సినిమాకు ఆరుగురు దర్శకులు.. ప్రదీప్ రంగనాథన్ సరికొత్త ప్రయోగం!

Updated : Jul 6, 2026

కోలీవుడ్ లో వినూత్నమైన కథలతో, ట్రెండీ ఆలోచనలతో యువతను విశేషంగా ఆకట్టుకుంటున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఇప్పుడు నిర్మాతగా సరికొత్త అవతారమెత్తారు. 'PR షో' అనే బ్యానర్‌ను స్థాపించి, మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసే ఒక అద్భుతమైన ప్రయోగానికి తెరలేపారు. సాధారణంగా ఒక సినిమాకు ఒకే దర్శకుడు ఉంటారు, ఒక్కోసారి ఇద్దరు కలిసి పని చేయడం చూస్తుంటాం. కానీ ప్రదీప్ రంగనాథన్ ఏకంగా ఆరుగురు రైటర్-డైరెక్టర్లను ఒకే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఆరుగురు దర్శకుల బృందాన్ని ఆయన "ఆల్ఫా యూనిట్" అని పిలుస్తున్నారు. ఈ ఆరుగురు కలిసి ఉమ్మడిగా కథను సిద్ధం చేసుకోవడమే కాకుండా, సినిమాను కూడా సంయుక్తంగా తెరకెక్కిస్తుండటం విశేషం. గతంలో 1999లో వచ్చిన తమిళ చిత్రం 'స్వయంవరం' (Suyamvaram) కోసం పలువురు దర్శకులు కలిసి పని చేసినప్పటికీ, ఈ సినిమా పూర్తి భిన్నమైన ఫార్మాట్‌లో సరికొత్త టెక్నాలజీతో రాబోతోంది. కేవలం ఒకే ఫీచర్ ఫిల్మ్ కోసం ఆరుగురు దర్శకులు కలిసి పనిచేయడం అనేది ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే ఒక హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను తాజాగా విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో మమితా బైజు రౌద్ర రూపాన్ని చూపించబోతున్నట్లు ప్రోమో ద్వారా స్పష్టమైంది. వీడియో గ్లింప్స్‌లో మమితా రక్తం అంటిన కత్తిని పట్టుకుని, పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్న అశ్విత్ మారిముత్తుపైకి విసరడం చూస్తుంటే.. ఒక యువతికి , ఒక శక్తివంతమైన పోలీస్ అధికారికి మధ్య జరిగే హోరాహోరీ పోరాటమే ఈ సినిమా అని అర్థమవుతోంది.

ఈ సినిమాలో మమితా బైజు, అశ్విత్ మారిముత్తుతో పాటుగా కీలక పాత్రల్లో శివాజీ సొంటినేని, స్వాసిక నటిస్తుండగా, ఈ చిత్రం ద్వారా అనామిక మహి అనే సరికొత్త నటి ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. ఇక ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్‌గా దూసుకుపోతున్న సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. దర్శకుడిగా, నటుడిగా తన మార్క్ చూపించిన ప్రదీప్ రంగనాథన్, నిర్మాతగా తన తొలి అడుగులోనే ఇలాంటి విభిన్నమైన, ప్రయోగాత్మకమైన చిత్రాన్ని ఎంచుకోవడం ఆయన సినీ అభిరుచికి అద్దం పడుతోంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాపై అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

 

Pradeep Ranganathan, PR Show Banner, Six Directors, The Alpha Unit, Mamitha Baiju

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.