Home  »  News  »  కె.విశ్వనాథ్ నన్ను చెంప మీద కొట్టారు.. ఆ సినిమా వల్ల అరెకరం అమ్మేశా: రాజేంద్రప్రసాద్

Updated : Jul 6, 2026

తనదైన హాస్యంతో, విలక్షణ నటనతో ఐదు తరాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న 'నటకిరీటి' రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుండి 'పద్మశ్రీ' అవార్డును అందుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయనకు సన్మాన కార్యక్రమ జరిగింది. ఈ సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ.. తన 48 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన అరుదైన అనుభవాలను, ఆసక్తికరమైన విషయాలను ఎంతో ఓపెన్‌గా పంచుకున్నారు.

తన సుదీర్ఘ కెరీర్‌లో ఎప్పుడూ ఎలాంటి వివాదాలకు చోటివ్వలేదని స్పష్టం చేసిన రాజేంద్రప్రసాద్, ఈ మధ్య కాలంలో వస్తున్న సోషల్ మీడియా ట్రోల్స్ గురించి ఏమాత్రం పట్టించుకోనని అన్నారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు కాలం నుండి నేటి తరం సూపర్ స్టార్లు మహేష్ బాబు, అల్లు అర్జున్ వరకు ఐదు జనరేషన్ల హీరోలతో కలిసి ట్రావెల్ కావడం దేవుడు తనకు ఇచ్చిన గొప్ప ప్రసాదంగా ఆయన అభివర్ణించారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సైతం తనకు చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. అలాగే చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మాణంలో తాను నటించిన 'సేనాపతి' సినిమాను చూసి మెగాస్టార్ చిరంజీవి తన నటనను ఎంతగానో అభినందిస్తూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ వేదికపై రాజేంద్రప్రసాద్ తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'ఆ నలుగురు' సినిమా గురించిన ఒక షాకింగ్ సంఘటనను బయటపెట్టారు. ఈ క్లాసిక్ సినిమా చూసి లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు థియేటర్ నుండి బయటకు వస్తున్న సమయంలో తాను ఎదురుపడ్డానని చెప్పారు. అప్పుడు విశ్వనాథ్ గారు ఒక్కసారిగా తన చెంప మీద కొట్టారని, దాంతో మొదట తనకు ఏమీ అర్థం కాలేదని, సినిమా నచ్చలేదేమో అని భయపడ్డానని అన్నారు. అయితే వెంటనే విశ్వనాథ్ గారు తనను హగ్ చేసుకుని, "నీ దుంపతెగ.. సినిమా అంతా వెతికాను కానీ ఎక్కడా ఒక్క ఫ్రేమ్‌లో కూడా నాకు రాజేంద్రప్రసాద్ కనిపించలేదు, కేవలం ఆ పాత్ర మాత్రమే కనిపించింది.. నువ్వు నేర్చుకున్న నటనను పర్‌ఫెక్ట్‌గా వాడుకున్నావ్.. గాడ్ బ్లెస్ యూ" అని మనస్ఫూర్తిగా దీవించారని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

నటుడిగా ఎంతో మంది హృదయాలను గెలిచినప్పటికీ నిర్మాతగా మాత్రం తాను ఫెయిల్యూర్ అయ్యానని రాజేంద్రప్రసాద్ నిజాయితీగా ఒప్పుకున్నారు. తన భార్య విజయ చాముండేశ్వరి ప్రొడ్యూసర్‌గా మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో 'మేడమ్', 'రాంబంటు' చిత్రాలను నిర్మించామన్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన 'మేడమ్' చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా, నంది అవార్డుల్లో 'బెస్ట్ యాక్ట్రెస్' కేటగిరీలో తనకు స్పెషల్ జ్యూరీ అవార్డు తెచ్చిపెట్టిందని, ఆ అవార్డు కోసం లెజెండ్ ఏఎన్నార్ తన పేరును స్వయంగా రెఫర్ చేశారని గుర్తుచేసుకున్నారు. కానీ ఆ తర్వాత నిర్మించిన 'రాంబంటు' సినిమా మాత్రం భారీ ఆర్థిక నష్టాలను మిగిల్చిందని, ఆ సినిమా నష్టాలను పూడ్చడానికి అన్నపూర్ణ స్టూడియోస్ పక్కనే ఉన్న తన అరెకరం భూమిని అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో తాను ప్రొడ్యూసర్‌గా పనికిరానని తేల్చుకుని, ఆ తర్వాత ఎప్పుడూ సినిమాలు నిర్మించలేదని స్పష్టం చేశారు.

 

 

Rajendra Prasad, Padma Shri, K Viswanath, TeluguOne

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.